Home క్రైమ్ బ‌రువెక్కిన హృద‌యాల‌తో ఎదురు చూపులు

బ‌రువెక్కిన హృద‌యాల‌తో ఎదురు చూపులు

589
0

ముంబయి : యువత హృద‌యాల్లో అతిలోక సుందరి ముద్ర వేసుకున్న న‌టి శ్రీదేవి పార్థివదేహం ఎట్టకేలకు ముంబయి చేరుకుంది. దుబాయ్ పోలీసులు ఉత్కంఠ పరిణామాల మధ్య మంగళవారం మధ్యాహ్నం ఆమె భౌతికకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. యునైటెడ్ ఎమిరేట్స్ నిబంధ‌న‌ల ప్ర‌కారం శ్రీదేవి భౌతికకాయానికి రసాయనిక శుద్ధి చేసిన అనంత‌రం అనిల్‌ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించారు. అదే విమానంలో బోనీకపూర్‌, అర్జున్‌కపూర్‌, సంజయ్‌కపూర్‌తో పాటు 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. మంగళవారం రాత్రి 9.30గంటల సమయంలో ముంబయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా లోఖండ్‌వాలాలోని గ్రీన్‌ యాకర్స్‌కు శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించారు.

శ్రీ‌దేవి పార్దీవ దేహం తీసుకొస్తున్నార‌ని తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, సినీనటులు అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌తో పాటు పలువురు ముంబాయి ఎయిర్‌పోర్టు వ‌ద్ద శ్రీ‌దేవి పార్ధీవ దేహాన్ని చూసి నివాళుల‌ర్పించారు. తమ అభిమాన నటిని క‌డ చూపు చూసేందుకు పెద్ద‌ సంఖ్యలో అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. దీంతో ముంబయి విమానాశ్రయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేకమంది సినీ ప్రముఖులు, అభిమానులు కడసారి చూసేందుకు అభిమానులు బరువెక్కిన హృదయాలతో శ్రీదేవి నివాసం వద్ద వేచి చూస్తున్నారు. బుధ‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.