విజయవాడ : గడిచిన నాలుగేళ్లలో విభజన హామీలు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేకసార్లు కేంద్రంతో సంప్రదింపులు చేశారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్ల ఉండాలని అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న ఎం వెంకయ్యనాయుడు పార్లమెంటులో కూడా చెప్పారని అన్నారు. అనేక కారణాలతో ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని దినకర్ చెప్పారు. విజయవాడ టిడిపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బాలయోగి వర్ధంతి సభలో దినకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని విభజన సమయంలో హామీల సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేస్తున్నారని అన్నారు.
నాలుగేళ్లుగా టిడిపి ఎందుకు మాట్లాడలేదని పవన్ కళ్యాణ చేసిన ప్రశ్నను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ది, ప్రజల ప్రయోజనం కోసమే టిడిపి కేంద్రంలో బిజెపితో స్నేహం చేస్తుందన్నారు. కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో మంత్రిపదువులు టిడిపి కొత్తేమీ కాదన్నారు. టిడిపి కేంద్రంలో స్పష్టమైన వైఖరితో ముందుకెళుతుందన్నారు. ఈ పాటికే విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎంపి రామ్మోహన్‌నాయుడు పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు దాఖలు చేశారని చెప్పారు. జెఎఫ్‌సి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యల జోలికి వెళ్లడంలేదన్నారు. దశలవారీగా టిడిపి కేంద్రంపై పోరుబాటు ఉంటుందన్నారు. ప్రజాసంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తుందని చెప్పారు.