పద్దారవీడు : స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఏపీ మహిళా సమతా సొసైటీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై మండల స్థాయిలో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. సదస్సులో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మాట్లాడారు. బాలికలకు 18వ సంవత్సరం వచ్చే వరకు వివాహం చేయకూడదన్నారు. అలా చేస్తే చట్టప్రకారం నేరమని చెప్పారు. విద్యార్ధినులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువుకోవాలన్నారు. చదువుకు వివాహం ఆటంకంగా ఎదురయ్యే పరిస్థితి ఉంటే తమకు సమాచారం ఇస్తే చదువులకు సహకరిస్తామని చెప్పారు. ఎఎన్ఎం రాజేశ్వర్ మాట్లాడుతూ తాము యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఇలాంటి అవగాహన ఎవ్వరూ ఇవ్వలేదని చెప్పారు.
ఆర్థికంగా బలపడాలంటే ఆడవాళ్లకు, ఆడపిల్లలకు స్వతంత్రత ఉండాలన్నారు. ఆరోగ్యం బాగా కాపాడుకోవాలన్నారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ హైమవతి మాట్లాడుతూ ఎన్ని చట్టాలు వచ్చినా మనలో మార్పు రాకుంటే ప్రయోజనం లేదన్నారు. చదువు అన్ని సమస్యలకు పరిష్కారమని ఉదాహరణలతో వివరించారు. తర్వాత పిల్లలకు ఉన్న చట్టాలు, మానవ సంబంధాల పై సమాచారం ఇచ్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా సమతా సొసైటీ జూనియర్ రిసోర్స్ పర్సన్ జెస్సీ, కార్యకర్త స్నేహలత పాల్గొన్నారు.