చీరాల : నెలకు కేవలం రూ.430కు 20 నుండి 100 యంబిపియస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ సేవలందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ చీరాల డిఇ కె మోహన్ రావు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ హోం ఫైబర్ ఇంటర్నెట్ రంగంలో సైతం చవక ధరల ఆఫర్లతో సంచలనాలకు తెరతీసిందన్నారు. ఇప్పటి వరకు ఇంటర్‌నెట్ రంగంలో ఉన్న ప్రైవేటు కంపెనీలు కేవలం సాధారణ ల్యాన్ వైర్ల ద్వారా ఇంటర్నెట్ డేటాను అందిస్తుండగా ఫైబర్ వైర్ల ద్వారా బిఎస్ఎన్ఎల్ ఇళ్ళకు, వ్యాపార సంస్థలకు నేరుగా ఇంటర్నెట్ అందిస్తుందని తెలిపారు. ప్రవేటు కంపెనీలు ఇన్ష్టలేషన్ ఛార్జీలు వసూలు చేస్తుండగా తాము ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కనీస వినియోగపు వ్యవధి నెల రోజులు మాత్రమే నిర్ణయించినట్లు వెల్లడించారు.
అంటే నెల తరువాత వినియోగ దారులు సంస్థ సేవలు నచ్చకుంటే కనెక్షన్ ను విరమించుకోవచ్చని తెలిపారు. అదే ప్రైవేటు సంస్థలలో కనీసం 3 నెలలకు వినియోగ సబ్యత్వం తీసుకోవాల్సి ఉందన్నారు. తమ కేబుల్ వైర్లు ఎక్కువ లోతులో ఉన్నందున 99శాతం సాంకేతిక సమస్యలు రావని చెప్పారు. ప్రవేటు కంపెనీలు గృహ అవసరాలకు, వ్యాపార అవసరాలకు వేరువేరుగా వసూలు చేస్తుండగా తాము మాత్రం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే బిఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి విడతగా చీరాల పట్టణం, కొత్తపేట ప్రాంత వినియోగదారులకు ఈ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని తెలిపారు.