చీరాల : సిపిఎం సీనియర్ నాయకులు, సంతనూతలపాడు మాజీ ఎంఎల్ఎ తవనం చెంచయ్య 4వ వర్ధంతి సభను చీరాల సుందరయ్య భవనంలో గురువారం నిర్వహించారు. సభకు సిపిఎం నాయకులు ఎం వసంతరావు అధ్యక్షత వహించారు. సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన చెంచయ్య జీవితకాలం తాను నమ్మిన కష్టజీవుల సిద్దాంతానికి కట్టుబడి జీవించారన్నారు. రాజకీయాల్లో మచ్చలేని నేతగా ఎదిగారన్నారు.
నిజాయితీ, నిరాడంబరతకు నిలువెత్తు రూపం చెంచయ్య అన్నారు. చెంచయ్య కలలు కన్న పేదల రాజ్యంకోసం ప్రజాపోరాటాల్లో కార్యకర్తలు పనిచేయాలని కోరారు. పేదల ఉపాధిని దెబ్బతీస్తూ, కష్టజీవులు, ఉద్యోగ, కార్మికుల హక్కులు హరించే ప్రవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల్లో కలిసి రావాలని కోరారు.
తొలుత చెంచయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అవినీతి, అక్రమాలతో రాజకీయాలకు అర్ధం మార్చిన నేటి పరిస్థితుల్లో తవనం చెంచయ్య వంటి నేతల జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలన్నారు. సభలో సిపిఎం నాయకులు దేవతోటి నాగేశ్వరరావు, డి నారపరెడ్డి, గవిని నాగేశ్వరరావు, పి సాయిరాం, బి సుబ్బారావు, ఐవి ప్రసాద్, ఎం సత్యమూర్తి, వై సింగయ్య, ఏసురత్నం, జూపూడి రోశయ్య, జి గంగయ్య, ఎస్ఎఫ్ఐ రాంబాబు, బట్టు సుబ్బారావు పాల్గొన్నారు.