రాంచీ : బాలికలపై అత్యాచార ఘటనలతో దేశం అట్టుడుకుతుంది. టివి ఛానెల్స్, పత్రికలు ఎక్కడ చూసినా పతాక శీర్షికల్లో బాలికలపై అఘాయిత్యాలు ఇటీవల పెద్దెత్తున చూస్తున్నాం. పోలీసులు నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వం ఉరితీస్తామని చెబుతుంది. కానీ ఎక్కడా అలాంటి ఘటనలను ఆపలేకపోతున్నారు. ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. తాజా ఉదంతం మరింత ఆందోళన కలిగిస్తుంది. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి గ్రామపెద్దలు శిక్ష వేశారన్న కారణంతో ఇంటికెళ్లి సజీవంగా తల్లిదండ్రుల ఎదుటే కాల్చేశారు.
ఝార్ఖండ్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ తెందుహ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గత (గురువారం) రాత్రి నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగి వచ్చిన నలుగురు యువకులు ఇంట్లోంచి బాలికను అపహరించుకుని వెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పంచాయితీ పెద్దకు, ఇతర సభ్యులకు చెప్పడంతో నిందితులకు రూ.50వేల జరిమానా విధించి, గుంజీలు తీయించారు.
గ్రామపెద్దలకు చెప్పి పంచాయితీ పెట్టించారన్న కక్షతో శుక్రవారం మరోసారి నలుగు దుండుగులు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను కొట్టి బాలికకు నిప్పంటించి పరారయ్యారు. ఆ మంటల్లో బాలిక కాలిపోయి మరణించింది. ఘాతుకానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మంటల్లో పూర్తిగా కాలిపోయిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు.