చీరాల : కాశ్మీర్‌లో చిన్నారి అసిఫాపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గడియార స్థంభం సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత మైనార్టీలు, బాలికలపై దాడులు పెరిగిపోయాయన్నారు. అలాంటి దాడులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. లౌకిక, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
కార్యక్రమంలో చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు, దళిత చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు మద్దు ప్రకాశరావు, బలహీనవర్గాల సమాఖ్య అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, డివైఎఫ్ఐ కార్యదర్శి పి సాయిరాం, డి నారపరెడ్డి, దళిత ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ బెజ్జం విజయకుమార్, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, ప్రజావేదిక కన్వీనర్ గుమ్మడి ఏసురత్నం, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ అబ్దుల్ రహీం, కెఎన్‌పిఎస్ నాయకులు గుమ్మడి రమేష్, బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, దుడ్డు విజయసుందర్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అలీమ్‌బాబు, కర్న హనుమంతరావు పాల్గొన్నారు.