Home బాపట్ల ప్రజా సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే వేగేశన

ప్రజా సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే వేగేశన

7
0

బాపట్ల : కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పట్టణంలోని 14, 13 వార్డుల్లో శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ‘సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం, చేసిన అభివృద్దిని వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. సంక్షేమ పధకాలు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పధకాలు అందని వారి వివరాలు నమోదు చేసుకుని సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రహదారులపై గుంటలు పుడ్చే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.12వేల కోట్లుతో 20వేల కిలోమీటర్ల రోడ్లను బాగు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దుచేసి ప్రజలకు ఊరట కలిగించిన విషయాన్ని గుర్తు చేశారు. 8.50 లక్షల మంది రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.13.5 వేల కోట్లు చెల్లించామన్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన ఏడాదిలోపే రూ.9.30లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకు వచ్చిందని చెప్పారు.

నిరుద్యోగుల కోసం డీఎస్సీ విడుదల చేశామని అన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పారు. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆగష్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సిఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు మూడు విడతలుగా రూ.20 వేలు అందిస్తామని తెలిపారు. ఇలా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాశ్ నారాయణ, టిడిపి పట్టణం అద్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, నర్రా వీరాంజనేయులు, బోయిన సాంబయ్య పాల్గొన్నారు.