Home జాతీయం ప్ర‌ణ‌య్ హ‌త్య‌… అమృత వ్యాఖ్య‌లు… మారుతీరావు వాద‌న‌లు… సోష‌ల్ మీడియా వేదిక‌గా నేర్పుతున్న పాఠాలు

ప్ర‌ణ‌య్ హ‌త్య‌… అమృత వ్యాఖ్య‌లు… మారుతీరావు వాద‌న‌లు… సోష‌ల్ మీడియా వేదిక‌గా నేర్పుతున్న పాఠాలు

889
0

అమ‌రావ‌తి : ప్రేమ‌వివాహాల్లో హ‌త్య‌ల‌కు, బ‌హిష్క‌ర‌ణ‌ల‌కు గుర‌వుతున్న యువ‌త‌లో ఆవేశం, భిన్న‌వాద‌న‌లు స‌హ‌జ‌మే. ఈ వివాదాల్లో కులం ప్ర‌ధానాంశంగా ముందుకు వ‌చ్చింది. ముందుకు రావ‌డ‌మే కాదు తీవ్ర‌మైన చ‌ర్చ‌ల‌కు దారితీస్తుంది. ఈ ఘ‌ట‌న‌పై ఒక్కొక్క‌రు ఒక్కొక్క విధంగా స్పందించిన తీరు సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద దుమార‌మే రేపింది. గ‌తంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం చోటు చేసుకున్నాయి. ఆత‌ర్వాత ఒక‌టీ, రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. కానీ వీటికేటికీ రాని ప్ర‌చారం ప్ర‌ణ‌య్ హ‌త్య‌కు రావ‌డం వెనుక కులం, ప‌రువు హత్య‌గా చెప్ప‌డ‌మే.

మిర్యాలగూడలో వైశ్య‌కులానికి చెందిన అమృత‌, మాల కులానికి చెందిన‌ ప్రణయ్ ప్రేమించి వివాహం చేసుకోవ‌డాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి హ‌త్య‌కు పాల్ప‌డటం అంద‌రినీ క‌ల‌చి వేసింది. ఈ ఘ‌ట‌న‌ టీవీ ఛానళ్లలో, వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ కార‌ణ‌మైంది. కులోన్మాదంతో ముడిపడి పరువు హత్యగా తెర పైకొచ్చిన ప్రణయ్ హత్య కేసు వ్యవహారంలో మరో ఆందోళనకర విషయమే ముందుకొచ్చింది. హత్యకు గురైన ప్రణయ్‌కు, అతని భార్య అమృతకు సోషల్ మీడియా సాక్షిగా ఎంతమంది మద్దతు తెలుపుతున్నారో… అదే స్థాయిలో హ‌త్య చేయించిన మారుతీరావు చేసిన పనిని సమర్థిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ‘జై మారుతీరావు.. జై మారుతీ సేన’ అంటూ కొందరు ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే… మారుతీ రావు ఫొటోను తమ ప్రొఫైల్ పిక్‌గా మార్చేసుకున్నారు.

‘‘నాకు పెళ్లైతే ముందు ఆడపిల్ల పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటా కానీ అమృత లాంటి ఆడపిల్లని మాత్రం ఇవ్వకు స్వామి’’. అంటూ కొంద‌రు, ‘‘9వ తరగతిలోనే ప్రేమ ఏమిటి? ఆ వయసు ప్రేమించడానికి తగినదేనా? అది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ..! అమృత విషయంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అంటూ వాద‌న వినిపిస్తున్నారు. మరో పోస్ట్‌లో మారుతీరావు విషయంలో అమృత చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగానే త‌ప్పు ప‌డుతున్నారు. తన తండ్రిని ఉరి తీయాలంటూ అమృత చేసిన‌ వ్యాఖ్యల‌పై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలా మారుతీరావు మద్దతుదారుడు ఒకరు పోస్టు చేశారు.

‘‘అవును. నీ తండ్రిని నువ్వు ఎన్ని సంవ‌త్స‌రాలు మాన‌సిక క్షోభ‌కు గురిచేశావో నీకు తెలుసా? అందుకే నీలాంటి కూతుర్ని క‌న్నందుకు మారుతీరావును ఉరి తీయాల్సిందే.’’ అంటూ పోస్టు పెడుతున్నారు. ఇలా చాలామంది అమృతను తప్పుబడుతున్నారు. మారుతీరావును సమర్థిస్తున్నారు. ఇలాంటి పరిణామాలపై సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులోన్మాదం ఎంతగా వేళ్లూరుకుపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదంటున్నారు.

వీటితోపాటే రిజ‌ర్వేష‌న్ అంశాన్నీ తెర‌పైకి తెచ్చారు. చ‌దువు, ఉద్యోగ నియామ‌కాల్లో కులాన్ని చెప్పుకునేవాళ్ల‌కు ప్రేమ‌వివాహానికి కులాన్ని ఎందుకు వ‌ద్దంటున్నారంటూ వారివాద‌న వారు వినిపిస్తున్నారు. ఇలాంటి వాద‌న‌ల‌తోనే ఈ కేసుకు సోష‌ల్ మీడియా, టివి ఛానెల్స్‌లో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

నిజ‌మే… అస‌లు కులం పోతుందా? కుల స‌మ‌స్య‌కు ప్రేమ‌వివాహాలు ప‌రిష్కారం చూపుతాయా?
కులం పోవాలాని సామాజిక ఉద్య‌మాలు చాలా వ‌చ్చాయి. కుల స‌మ‌స్య‌కు అనేక ర‌కాల ప‌రిష్కారాలు చూపుతున్నారు. కానీ వేల సంవ‌త్స‌రాలుగా వేళ్లూనుకుని ఉన్న కుల వ్య‌వ‌స్థ‌కు ప‌రిష్కారం ప్రేమ వివాహాలేనా? అభివృద్ది చెందిన స‌మాజంలో చిట్ట‌చివ‌రి ప‌రిష్కార అంశ‌మైతే కావ‌చ్చేమో కానీ ఇప్ప‌టి సామాజిక ప‌రిస్థితుల‌కు ప్రేమ‌వివాహాలు కుల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎలా అవుతాయి? ఇలాంటి సామాజిక స‌మ‌స్య‌కు స‌మాధానం ఉందా? ప్ర‌భుత్వ‌మే బిడ్డ క‌డుపున ప‌డ్డ‌ప్పుడే అంగ‌న‌వాడీ కార్య‌క‌ర్త వ‌స్తుంది. గ‌ర్భ‌వ‌తి పేరు న‌మోదు చేసుకోవ‌డంలోనే త‌ల్లి తండ్రి కులాన్ని రికార్డులో న‌మోదు చేస్తున్నారు. అక్క‌డి నుండి వైద్య‌శాల‌లో పురుడు పోసుకున్న మ‌రుక్ష‌ణం జ‌న‌న దృవీక‌ర‌ణ ప‌త్రం తీసుకోవాలంటే కులం చెప్పాల్సిందే. ఇద్ద‌రు వేరు వేరు కులాల జంట వివాహం చేసుకుంటే వాళ్ల పిల్ల‌ల‌కు ఏ కులం చెబుతారు? వాళ్ల వివాహానికి తోడు చూడాలంటే ఆ జంట ఎన్ని అవ‌స్థ‌లు ప‌డాలో ఆద‌శ‌కు చేరిన ప్రేమ‌జంట‌ను అడిగితే చెబుతారు.

ఇటీవ‌ల కాలంలో త‌ల్లి, తండ్రి ప్రేమ‌లు ఎంత గొప్ప‌వో సోష‌ల్ మీడియా వేదిక‌గా అనేక పాట‌లు లైకులు, షేర్లు ల‌క్ష‌ల సంఖ్య‌లో పొందాయి. జ‌న్మ‌నిచ్చి, ప్రేమించే వ‌య‌స్సు వ‌చ్చేవ‌ర‌కు పెంచ‌డానికి త‌ల్లి తండ్రులు ప‌డిన క‌ష్టాన్ని ఏ సామాజిక కార్య‌క‌ర్త ప్ర‌శ్నించ‌డంలేదు. అలాగ‌ని ప్రేమించిన వ్య‌క్తిని హ‌త్య చేయ‌డం క‌రెక్ట‌ని స‌మ‌ర్ధించ‌డం కాదు. ప్ర‌ణ‌య్, అమృత ప్రేమ‌వివాహం చేసుకుని ఆరు నెల‌లైంది. ఆరు నెల‌ల త‌ర్వాత వాళ్లిద్ద‌రి ప్రేమ, పెళ్లి ముచ్చ‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం అవ‌స‌రమా? ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లి త‌న జీవితం త‌న‌దంటూ జీవిచేట‌ప్పుడు ఆరు నెల‌ల త‌ర్వాత కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేమాయ‌ణ వీడియోలు, ఫోటోలు అప్‌లోడ్ చేయ‌డం అంటే వాళ్లిద్ద‌రి ప్రేమ మ‌రొక‌రికి ఆద‌ర్శం కావాల‌నా? లేక అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇంటి వెళ్లింద‌న్న ఆవేద‌న‌తో ఉన్న వాళ్ల మాన‌సిక స్థితిని రెచ్చ‌గొట్టాల‌నా? ప్రేమ‌పెళ్లిళ్లు ప్రోత్స‌హిస్తే పొంగిపోయి కుల‌ర‌హిత స‌మాజంగా మారే ప‌రిస్థితి స‌మీపంలో ఎప్పుడైనా క‌నిపిస్తుందా?

గ్రామీణ ప్రాంతాల్లో కులం బ‌లంగా ఉంది. పెత్తందారులు ద‌ళితులను అణ‌గ‌దొక్కుతున్నారంటే అర్ధం ఉంది. కానీ మేధావులు, డాక్టరేట్లు పొందుతున్న విశ్వ‌విద్యాల‌య‌ల్లో గ్రామాల‌క‌న్నా విప‌రీత ధోర‌ణితో కులం వేళ్లూనుకుని ఉంటే ప్రేమ‌వివాహాలు కుల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎలా అవుతాయి? విశ్వ‌విద్యాలయ వైస్ ఛాన్స‌ల‌ర్‌ను తెలుగులో ఉప‌కుల‌ప‌తి అంటారు. దీన‌ర్ధం విశ్వ‌విద్యాల‌యాల్లో కులాల స‌మీక‌ర‌ణ‌లు చేసేవాడిగా కొంద‌రు విసిలు మార్చ‌లేదా? చ‌దువుకున్న మేధావులు ఆద‌ర్శాలు చూపాల్సిన చ‌దువుల కేంద్రాల‌నే మార్చ‌లేని సామాజిక ఉధ్య‌మాలు ప్రేమ‌వివాహాల‌ను ప్రోత్స‌హించి రెండు కుటుంబాల్లో తెలియ‌ని మాన‌సిక ఆవేద‌ను మిగిల్చ‌డం త‌ప్ప మ‌రేమీ మార‌దు.

త‌మ‌ను కాద‌ని వెళ్లినతర్వాత వెంబ‌డించి హ‌త్య చేసినంత మాత్రాన మాన‌సిక వేధ‌న తీర‌దు. పోయిన ప‌రువు తిరిగి రాదు. స‌హ‌నం వ‌హించ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగిందేమీ లేదు.