టిడిపి 2019 ఎన్నికలకు సిద్దమవుతుంది. గోదావరి జిల్లాలో ఆరుగురు సిట్టింగు ఎంఎల్ఎలను తప్పించనున్నారనే ప్రచారం ఊపందుకుంది. వారి స్థానంలో సమర్థులను వెతుకుతున్నట్లు సమాచారం. తప్పించాలనుకున్న వారికి ఈపాటికే పార్టీ నుండి సంకేతాలు అందినట్లు తెలుస్తుంది. టిక్కెట్టు దక్కని వాళ్లు పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేసినా తట్టుకునే వారెవరనేదానిపై పరిశీలన చేస్తున్నారు. సీటు లేదనే సమాచారం అందుకున్న నేతలు ఇతర పార్టీలవైపు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏదోకపార్టీలో సీటు సాధించాలనే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కేడర్‌లో అసమ్మతి ఎదుర్కొంటున్న వాళ్లు, వయో భారంతో ఉన్నవాళ్లు, పార్టీపట్ల నిబద్దత లేని వాళ్లు తొలగింపుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
కాకినాడ : లోక్‌సభ పరిధిలోని ప్రత్తిపాడులో అభ్యర్థిపై ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు 75 ఏళ్ల వయస్సుపై పడటంతో సీటు లేదని భావిస్తున్నారు. ఆయన స్థానంలో ఆయన అన్న, మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనవడు వరుపుల రాజాకి అవకాశం ఇస్తారని చెప్పుకుంటున్నారు. కుటుంబంలోనే ఇస్తున్నాం కాబట్టి వ్యతిరేకత రాదని అంచనా వేస్తున్నారు. ఇవే సంకేతాలు సుబ్బారావు వచ్చినట్లు సమాచారం. కాకినాడ రూరల్‌లో అభివృద్ధి చేసినప్పటికీ పిల్లి అనంతలక్ష్మి కుమారులపై వచ్చే ఆరోపణలతో ఇబ్బందులు తప్పడంలేదు. ఎంపీ తోట నరసింహాన్ని తప్పించి ఏదో అసెంబ్లీకి పంపుతారన్న ప్రచారం ఉంది. ఆయన కోసం మరో ఎమ్మెల్యేని తప్పించాల్సి ఉంది. పెద్దాపురం నుండి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రూకు టిక్కెట్లు దాదాపు ఖాయమని చెప్పుకుంటున్నారు.
అమలాపురం పార్లమెంటు పరిధిలో..
చంద్రబాబు సర్వేలో ఈ పార్లమెంటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ముమ్మిడివరంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ తక్షణం ప్రత్యామ్నాయ అభ్యర్థిని తెరపైకి తేవడం కష్టంగా మారింది. ఉన్న నేతలను సమన్వయం చేసుకుని బలోపేతం చేయాల్సి ఉంది. మిగిలిన మూడుచోట్లలో ఖచ్చితంగా ఇద్దరిని మార్చాలని భావిస్తున్నారు. అమలాపురం లోక్‌సభ నుండి దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు బరిలోకి దిగితే సమీకరణలు మారొచ్చు.
రాజమహేంద్రవరం సిటీ?
ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి స్థాన చలనం తప్పదని భావిస్తున్నారు. 1983 నుండి రాజమహేంద్రవరం సిటీలో పట్టున్న బుచ్చయ్యను ఈసారి సిటీకి మార్చితే మెజారిటీ వస్తుందనే వాదన వినిపిస్తోంది. రూరల్ నుండి కొత్తవారికి అవకాశం కల్పించే యోచనలో ఉన్నట్లు ప్రచారం. లోక్‌సభ పరిధిలోని మరో అసెంబ్లీకి బలమైన అభ్యర్థి కోసం టీడీపీ తీవ్రమైన కసరత్తే చేస్తోంది. టీడీపీ ఆహ్వానిస్తున్నా… ఆ నేత ఇంకా తన అభిప్రాయం ప్రకటించలేదు.
గొల్లపల్లికి రాజోలుకు బదులు మరొకచోట?
రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును మరో రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అలా మార్పు చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. తీవ్ర పరిణామాలేమైనా చోటు చేసుకుంటే అసలు సీటే లేకుండా చేసి పార్టీలో కాలక పదవితో సరిపెట్టవచ్చని భావిస్తున్నారు. ఈపాటికే ఒక మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతని చేరిక జరిగితే సూర్యారావు తిప్పలు తప్పవు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే జిల్లాలో ఆరుగురిని పూర్తిగా పక్కనపెట్టడం, ఇద్దరికి నియోజకవర్గ మార్చడం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపికలో ప్రత్యర్థి పార్టీల వ్యూహాన్ని బట్టి టీడీపీ అభ్యర్థుల ఎంపిక, తప్పించే వాటిల్లోనూ స్వల్ప మార్పులు ఉండవచ్చు.