Home బాపట్ల పర్చూరులో ‘ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం’ ప్రారంభం

పర్చూరులో ‘ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం’ ప్రారంభం

21
0

పర్చూరు : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం పర్చూరులో నిర్మాణం చేసిన ‘ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని’ సాప్ చైర్మన్ రవి నాయుడు, శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదివారం ప్రారంభించారు. స్థానిక వైఆర్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో రూ.2.20కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియం పర్చూరు ప్రాంత క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. తొలుత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఘనంగా స్వాగతం పలికారు. ఇరువురు బ్యాట్మెంటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపర్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ 2014 -19లో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఇండోర్ స్టేడియాల నిర్మాణం చేపట్టిందని చెప్పారు. అనంతరం గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసిపి ఇండోర్ స్టేడియం పనులు నిలిపేసి పాడుబడే విధంగా చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారానికి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్టేడియం పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని తనను కోరారని చెప్పారు. వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేయించి క్రీడా ప్రాంగణం పెండింగ్ పనులు పూర్తి చేయించామని చెప్పారు.

సీఎం చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి విడుతలవారీగా 132 క్రీడా వికాస కేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతా క్రీడాకారుల 10ఏళ్ల కల సాకారమైందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏలూరికి స్టేడియం నిర్వాహకులు టీ మల్లికార్జునరావు, టిడిపి అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు జ్ఞాపిక బహుకరించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు శంషుద్దీన్, ఎ శ్రీనివాసరావు, శాప్ మాజీ చైర్మన్ పున్నయ్య చౌదరి, డిప్యూటీ కలెక్టర్ కటారి రమేష్ నాయుడు, యు మురళీకృష్ణ, కటారి సురేంద్రబాబు, ఆర్డీఒ పి గ్లోరియా, తహశీల్దారు బ్రహ్మయ్య పాల్గొన్నారు.