పర్చూరు : నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలకు పొగాకు తీసుకువచ్చేటప్పుడు మార్క్‌ఫెడ్ నిబంధనలు పాటించాలని శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు రైతులకు సూచించారు. మండలంలోని అడుసుమల్లి, పెదనందిపాడు గ్రామాల్లో పొగాకు నిలువ ఉంచే గోదాములను ఆయన ఆదివారం పరిశీలించారు. రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా పొగాకు కంపెనీలు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో గత నాలుగు నెలలుగా పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మార్క్‌ఫెడ్‌ను రంగంలో దించి రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. అయితే తేమ 20 శాతం కంటే తక్కువ ఉండాలని, అప్పుడే మంచి ధర పలుకుతుందని సూచించారు. ఆయన వెంట ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, టిడిపి రాష్ట్ర నాయకులు కారుమంచి కృష్ణ, పోపూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.