– ఉద్యోగావకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి
– శాసన సభ్యులు ఎంఎం కొండయ్య
చీరాల (DN5 News) : పి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్‌ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మున్సిపల్ ఒపెన్ ఎయిర్ ధియేటర్ హాలులో జరిగిన జాబ్‌మేళా ప్రారంభ సభలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ మాట్లాడారు. నిరుద్యోగ యువతీ, యువకులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.
జాబ్‌మేళా ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జాబ్ మేళాలో 21 కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో నియామకాలకు అవకాశాలు ఇంటర్వూలు నిర్వహించాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 700 మందికి పైగా నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో 1800 మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.






