చీరాల : మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చీరాల కెజిఎంజి ఉన్నత పాఠశాల విద్యార్ధులు సోమవారం నిర్వహించారు. కూరగాయల మార్కెట్, తెల్లగాంధీబొమ్మ సెంటర్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి బాబు మాట్లాడారు. ప్రభుత్వ బడి అమ్మ ఒడి వంటిందన్నారు. పట్టణంలో 1946లో స్థాపించిన తొలి ప్రాధమిక పాఠశాల కెజిఎంజి పాఠశాల అన్నారు. బాలికా విద్య ప్రోత్సాహానికి 1949లో ఉన్నత పాఠశాలగా అభివృద్ది చేశారని చెప్పారు. 75సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల నేడు 751మంది బాలికల చదువులకు వేదికైందన్నారు.
ఆంగ్ల మాధ్యమంలోనూ మెరుగైన బోధన అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి 800మంది విద్యార్ధులు చేరే అవకాశం ఉందన్నారు. వర్చువల్ క్లాస్‌రూమ్, 4అదనపు తరగతి గదులు, సైకిల్ స్టాండ్, భోజనగది రానున్న రోజుల్లో సమకూరే అవకాశం ఉందన్నారు. పాఠశాల అభివృద్దికి ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని చెప్పారు. చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్ధులను అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ నడిబొడ్డున సురక్షితమైన ప్రదేశంలో ఉచిత చదువులను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకుని తమ పాఠశాలలో విద్యార్ధులను చేర్చాలని కోరారు. ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.