కందుకూరు : లోటు బడ్జెట్‌లో సైతం మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత తెలుగు దేశం ప్రభుత్వంలోనే జరిగిందని టిడిపి శిక్షణా శిభిరం డైరెక్టర్, జెడ్‌పిటిసి కంచర్ల శ్రీకాంత్‌చౌదరి పేర్కొన్నారు. టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవామిత్ర శిక్షణ శిబిరం 25వ బ్యాచ్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ రూ.16వేలకోట్ల లోటుబడ్జెట్‌లో కూడా మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ,లౌకిక విధానాలకు కట్టుబడి, మత సామరస్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2018-19 బడ్జెట్‌లో రూ.1,102 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. పేదముస్లింల విద్యావికాసానికి ప్రతి సంవత్సరం రూ.200 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 223షాదిఖానాలకు రూ.52.66కోట్ల నిధులను విడుదల చేసారని చెప్పారు. 4237మంది ఇమామ్‌లకు, మౌజన్‌లకు నెలనెలా రూ.5000, రూ.3000 గౌరవ వేతనం అందిస్తున్నారని చెప్పారు. పేద ముస్లిం యువతుల వివాహానికి ఒక్కొక్కరికి రూ.50వేలు చంద్రన్న పెళ్ళికానుక (దుల్హన్) ద్వారా అందిస్తున్నారని పేర్కొన్నారు. రూ.40కోట్ల నిధులతో ఏటా 12లక్షల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముస్లిం మైనార్టీల రక్షణ, అభివృద్దికి కృషి చేస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లోనూ టిడిపికి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో శిక్షకులు కాకర్ల మల్లిఖార్జున్, యర్రా సాంబశివరావు, ఉరుకొంద, కో ఆర్డినేటర్ పోకూరి రాంబాబు, కొల్లి అవినాష్ పాల్గొన్నారు.