చీరాల : ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఎఐఐఇఎ 68వ వార్షికోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. చివరిరోజైన శనివారం వేటపాలెంలో పాఠశాల విద్యార్ధులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం చీరాల బ్రాంచి కార్యాలయంలో వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. సభకు టి విజయకుమార్ అధ్యక్షత వహించారు. సభలో ఎల్ఐసి చీరాల బ్రాంచి మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎల్ఐసి సిబ్బంది రోజూ భీమాపాలసీలు, ఆఫీసు కార్యకలాపాలతోపాటు యూనియన్ ఆవిర్భావం సందర్భంగా వారం రోజులపాటు సేవాకార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్న సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఎఐఐఇఎ చీరాల బ్రాంచి కార్యదర్శి భూపతి నాగేశ్వరరావు మాట్లాడుతూ వారం రోజుల్లో జరిగిన వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన వారోత్సవాల్లో రెండు రోజులు వృద్దాశ్రమాల్లో అన్నదానం, ప్రభుత్వ వైద్యశాల రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ, రక్తదాన శిభిరం, విద్యార్ధులకు నోటుపుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు విజయవంతం చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఆర్‌విఎస్ రామిరెడ్డి, ఎంబి నెహ్రూ, బుజ్జిబాబు, టివి రావు, సిబ్బంది పాల్గొన్నారు.