కొండేపి : జగన్ ప్రజాసంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తుంటే కొండేపి నియోజకవర్గంలో వైసిపి నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్‌బాబుకు అండగా 25నుండి 27వరకు నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు కార్యకర్తలు ప్రకటించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మండల, గ్రామ స్థాయి నాయకులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25న కొండేపిలో ప్రారంభమయ్యే పాదయాత్ర శింగరాయకొండలో 27న భారీ బహిరంగ సభతో ముగుస్తుందని వైసిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి డాకా పిచ్చిరెడ్డి తెలిపారు. 25న కొండేపి, కె.ఉప్పలపాడు వరకు, 26న ఉప్పలపాడు నుండి టంగుటూరు వరకు, 27న టంగుటూరు నుండి శింగరాయకొండ వరకు పాదయాత్ర సాగుతుందని తెలిపారు.
పాదయాత్ర ప్రారంభంలో 10వేలమందికిపైగా పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వైసిపి జిల్లా కార్యదర్శి చింతపల్లి పేరయ్య, జిల్లా నాయకులు సత్యంపంతులుతోపాటు టంగుటూరు, కొండేపి, జరుగుమల్లి, మర్రిపూడి మండలాల పార్టీ అధ్యక్షులు ఎం రాఘవరెడ్డి, ఆరికట్ల వెంకటేశ్వర్లు, పాటిబండ్ల నాగేశ్వరరావు, దద్దాలి మల్లిఖార్జునరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం భాస్కర్ పాల్గొన్నారు.