డిల్లీ / విశాఖపట్నం : నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు ప్రవేశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా వాల్తేరు కేంద్రీయ విద్యాలయ (KV) ప్రిన్సిపల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ మేరకు గురువారం సీబీఐ అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. వాల్తేరులోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాసరాజా అనే వ్యక్తి గత రెండేళ్లలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లంచం తీసుకుని వివిధ కేంద్ర విద్యా సంస్థల పేరుతో ఉన్న నకిలీ ధ్రువపత్రాలతో 193 మంది విద్యార్థులకు పాఠశాలలో అక్రమంగా ప్రవేశం కల్పించినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
2021-22 విద్యా సంవత్సరంలో 124మంది, 2022-23లో 69మంది విద్యార్థులకు అక్రమంగా ప్రవేశం కల్పించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 3, 4 తేదీల్లో సీబీఐ విశాఖపట్నం డివిజన్ అధికారులు వాల్తేరులోని కేవీలో ప్రవేశాల వివరాలపై తనిఖీలు చేశారు. కేంద్రీయ విద్యాలయ కమిషనర్ నుంచి అనుమతి పొందిన తర్వాత శ్రీనివాసరాజాపై చర్యలు తీసుకుంటామని సీబీఐ వెల్లడించింది.