బెంగళూరు : కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ డాన్‌గా పేరుతెచ్చుకున్న గాలి జనార్దన్‌రెడ్డి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ చీటింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన అనుచరుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. కొద్దిసేపట్లోనే వాళ్ళ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. అంతే సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు బయలుదేరారు. అంబిడెడ్ మార్కెటింగ్ కంపెనీ చీటింగ్ కేసులో తనను అరెస్ట్ చేస్తారని గాలి జనార్దన్‌రెడ్డి ముందుగానే పసిగట్టారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నారు. అదే కేసులో గాలి జనార్ధన్‌రెడ్డికి సహకరించిన ఆలీఖాన్ అనే వ్యక్తికి బెంగళూరులో బెయిల్ దక్కింది.
ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో అంబిడెంట్ అనే సంస్థ రూ.500కోట్లకు అవినీతికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటినుండి సీసీబీ, ఈడీ అధికారులు అంబిడెడ్ సంస్థ చైర్మన్ ఫారిద్‌ను విచారిస్తున్నారు. ఫారిద్‌ను తప్పించేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ ఒప్పందం ప్రకారం అంబిడెంట్ కంపెనీ నుండి బళ్లారికి చెందిన రాజ్మాహల్ జ్యుయెల్లర్‌కు రూ.18.5కోట్లతో పాటు రూ.2కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు సీసీబీ పోలీసులు చెబుతున్నారు. అంబిడెంట్‌తోపాటు బెంగళూరుకు చెందిన అంబికా జ్యుయెల్లర్స్, జనార్దన్‌రెడ్డికి చెందిన ఎనేబుల్ ఇండియా సంస్థలకు కూడా ఈ మొత్తం లావాదేవీల్లో భాగస్వామున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నుండి బయటపడేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీబీ డీసీపీ గిరీశ్ పర్యవేక్షణలో కర్నాటక పోలీసు బృందం గాలి జనార్ధన్‌రెడ్డి ఆచూకీ కోసం తెలంగాణలో గాలిస్తున్నట్లు సమాచారం.