Home ఆంధ్రప్రదేశ్ నాలుగేళ్లుగా చంద్ర‌బాబు మోసాలు చూస్తున్నారు క‌దా? ఆలోచించాల్సిన సమ‌య‌మొచ్చింది : జ‌గ‌న్‌

నాలుగేళ్లుగా చంద్ర‌బాబు మోసాలు చూస్తున్నారు క‌దా? ఆలోచించాల్సిన సమ‌య‌మొచ్చింది : జ‌గ‌న్‌

556
0

– క‌నిగిరి స‌భ‌లో జ‌గ‌న్ హామీల వ‌ర్షం
– ఎన్నిక‌ల స‌భ‌ను త‌ల‌పించేలా విమ‌ర్శ‌లు
– చంద్ర‌బాబు నాలుగేళ్ల‌పాల‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు

క‌నిగిరి : చంద్రబాబు టీవీల్లో, పత్రికల్లో కనిపిస్తున్నారు. చంద్రబాబు ఊసరవెల్లి కన్నా స్పీడ్ గా మాటలు మారుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏ పెద్ద ఏం చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో నాలుగు సంవత్సరాలుగా మీరు చూశారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలు, అన్యాయమైన పాలనపై స్పందించాల్సిన స‌మ‌య‌మొచ్చింది. దేశంలో ఎక్కడాలేని అవినీతి రాష్ట్రంలో జరిగింది. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు తొలగిస్తామని చంద్రబాబు చెప్పారు. మరి గ్రామాల్లో మంచినీళ్లు దొరుకుతాయా లేదో తెలీదు గానీ, మద్యం దొరకని గ్రామం ఉందా? అని ప్ర‌శ్నించారు. రూ.2ల‌కే మిన‌ర‌ల్ వాట‌ర్ అన్నారు కానీ ఫోన్ కొడితే మినరల్ వాటర్‌కు బ‌దులు మద్యం ఇంటికి డెలివరీ చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయ‌న్నారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణలో మనకన్నా రూ.7లు తక్కువకే పెట్రోల్, డీజిల్ రేటు ఉన్నాయ‌న్నారు. ఇంటిపన్నులు రూ.12,200 అయ్యింద‌న్నారు. ఎన్నికలప్పుడు కరెంటు బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న బాబు అధికారంలోకి వచ్చాక భారీగా పెంచారని పేర్కొన్నారు. బాబు వచ్చాక రూ.1000లకు పైగా కరెంటు బిల్లులు వస్తున్నాయని పేర్కొన్నారు.

బాబు అధికారంలోకి వచ్చాక మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని జ‌గ‌న్ చెప్పారు. పండగలు వస్తే ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే కొత్త సినిమాకు బ్లాక్‌లో టిక్కెట్లు కొనాలన్నట్లు భయపడే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. నాలుగు సంవత్సరాల బాబు పాలన ఇలా ఉంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, కిరోసిన్ అన్నీ ప్యాక్ చేసి రూ.185కే చేతుల్లో పెట్టేవారని తెలిపారు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ షాపుల్లో బియ్యం తప్పు ఇంకేమీ దొరకటం లేదన్నారు. ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదని కటింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతన్నలకు ఏ పంటకైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. గిట్టుబాటు ధరల కోసం తాను ధర్నాలు చేయని సంవత్సరం లేదన్నారు. పొగాకు రూ.165లు కూడా రావటం లేదని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు రాక రైతన్నలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వైయస్ కాలంలో రూ.4,200లు జామాయిల్ పంటకు గిట్టుబాటు వస్తే ఇప్పుడు రూ.1800లు కూడా రావటం లేదన్నారు. ఈ పెద్దమనిషి (బాబు) చేస్తున్న మోసాలు చూడండిని పేర్కొన్నారు. ఈ రుణాలు మీరు కట్టొద్దు అంటూ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా, వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి ఓట్లేయించుకున్న చంద్ర‌బాబు ఎంత మంది రైతుల‌కు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చింది? అంటే రాలేదు. బ్యాంకులు బంగారం వేలం వేస్తున్న నోటీసులు మాత్రం వ‌చ్చాయ‌న్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను బాబు మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్లు కన్నీరు కారుస్తున్నారని చెప్పారు.

జాబు రావాలంటే బాబు రావాలని చేసిన ప్ర‌చారం ఏమైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేద‌న్నారు. నేడు కాంట్రాక్టు ఉద్యోగస్తులు, ఔట్ సోర్సింగ్ వాళ్లు ధర్నా చేస్తున్న ప‌రిస్థితులు గుర్తు చేశారు. జాబు రావాలంటే బాబు పోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉందన్నారు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ టీడీపీ కార్యకర్తలు వెళ్లి బాబు సంతకం పెట్టారని ఏం చదవకపోయినా ఉద్యోగం ఇస్తారంటూ పాంప్లేట్లు ఇచ్చార‌న్నారు. నిరుద్యోగ బృతి నెల‌కు రూ.2వేలు ఇస్తామ‌న్న చంద్ర‌బాబు గ‌డిచిన 45 నెలల‌కు నెలకు రూ.2వేల చొప్పన ప్రతి ఇంటికీ రూ.90వేలు బాబు బాకీ ఉన్నాడ‌న్నారు.

`కాంట్రాక్టు ఉద్యోగస్తులు అందరికీ చెబుతున్నా. దేవుడు ఆశీర్వదించి. మన ప్రభుత్వం రావాలని కోరుకోండి. మీ క్వాలిఫికేషన్ బట్టి, అర్హత బట్టి, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల‌ను చేస్తాం.` అని జ‌గ‌న్ అన్నారు. సుప్రీం తీర్పు చెప్పిందని మిమ్మల్ని తొలగిస్తున్నారు. ఎలాగోలా ఈ ఒక్కసంవత్సరం ఆగండి. ఆతర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం. మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం. మీ అందరి జీతాలు పెంచి. టైం స్కేల్ అమలు చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. బాబు ఇసుక నుంచి మట్టిదాక, మట్టి నుంచి బొగ్గుదాకా, బొగ్గు నుంచి మద్యందాకా, మద్యం నుంచి కరెంటు కొనుగోళ్లు వరకు ఏదీ వదిలిపెట్టడం లేదన్నారు. కరెంటు కొనుగోళ్లు నుంచి కాంట్రాక్టర్ల వరకు, కాంట్రాక్టర్ల నుంచి రాజధాని భూములు, గుడి భూములూ బాబు తినుడే తినుడు విపరీతమైన అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. పైన బాబు అవినీతి చేస్తుంటే కింద జన్మభూమి కమిటీలు పింఛన్లు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు బొక్కుతున్నార‌ని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఎమ్మెల్యేలకు రూ.20నుండి 30 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. తెలంగాణలో ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోవటం మనం అందరం చూశామ‌న్నారు.

ఒక ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా దొరికిపోయినా వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడో ఈయన (బాబ‌) పాలనే నిదర్శనమ‌న్నారు. అవినీతికి చక్రవర్తి ఐన బాబు అవినీతిపై మనకు క్లాస్ పీకుతున్నాడ‌ని చెప్పారు. అసెంబ్లీకి పోవాలంటే మనస్సు రావటం లేదన్నట్లు అసెంబ్లీ నడుపుతున్నారని ఆరోపించారు. చట్టాలు చేసే చట్టసభల్లో వాటిని అవహేళన చేస్తున్నారని అన్నారు. కొన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేయక‌పోగా ఆ ఎమ్మెల్యేలను వారి పార్టీ గుర్తు మీద గెలిచిన‌వారిలా మంత్రి ప‌దువులు కూడా ఇచ్చార‌న్నారు. ఇలాంటి పాలన ఎక్కడైనా చూశారా? అని ప్ర‌శ్నించారు.

“రేపు ఎన్నికలప్పుడు చిన్న చిన్న మోసాలు చెప్పడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తాం అంటారు. నమ్ముతారా? నమ్మరని కేజీ బంగారానికి బోనస్ అంటారు. ప్రతి ఇంటికి బెంజ్ కారు అంటారు. తన హామీలు నమ్మరని ప్రతి ఇంటికి మనిషిని పంపి చేతిలో మూడు వేలు ఇస్తారు. ఇస్తే వద్దు అనొద్దు. మూడు వేలు కాదు. ఐదు వేలు గుంజండి. అది మన డబ్బే. మన జేబీలు కొట్టిన డబ్బే అదంతా. హామీలు ఇచ్చిన రాజకీయ నాయకుడు అది చేయకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి.“ అని జ‌గ‌న్ అన్నారు.

“కనిగిరి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. 787 గ్రామాలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. తాగే నీటిలో ఉండాల్సిన పరిమాణం కన్నా 5-10 పీపీఎం ఉంది. కిడ్నీ పేషెంట్లు, ఎముకల నొప్పులు వస్తున్నాయి. 423 మంది కిడ్నీ వ్యాధులతో చనిపోతే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకుందా? నేను వచ్చి కిడ్నీ బాధితుల కోసం ధర్నా చేస్తే 5 చోట్ల డయాలసిస్ యూనిట్లు పెట్టారు. కందుకూరు, కనిగిరి మార్కాపురం, ఒంగోలు రిమ్స్, చీరాలలో పెట్టారు. ఈ యూనిట్లలో నెఫ్రాలజిస్టులు కనిపించరు. నెఫ్రాలజిస్టులు లేని పరిస్థితుల్లో నడిపిస్తున్నారు. 80 యూనిట్ల నీళ్లు అవసరం అవుతుంది. ల్యాబ్ టెక్నీషియన్లతో యూనిట్లు నడిపిస్తున్నారు. వందల సంఖ్యలో పేషెంట్ల వెయిటింగ్ లిస్ట్ ఉంది.“ అన్నారు.

“రామతీర్థం ప్రాజెక్టును, గుండ్లకమ్మ ప్రాజెక్టును వైయస్ఆర్ కట్టారు. ఆ దివంగత నేత పుణ్యాన కనిగిరి నీళ్లు వస్తున్నాయి. రామతీర్థం నుంచి పైప్ వేసి కనిగిరికి నీళ్లు తీసుకువచ్చారు. మంచినీళ్లు, సాగర్ నీరు తీసుకువచ్చారు. గుండ్లకమ్మ ద్వారా సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు ప్రాంతంలో ఫ్లోరైడ్ లేకుండా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. వైయస్ఆర్ చలవ వల్లే ఫ్లోరైడ్ లేని నీళ్లు వచ్చాయి. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. వైయస్ఆర్ హయాంలో మొదటి సొరంగం 13 కి.మీ పూర్తి చేశారు. రెండో సొరంగం 9 కి.మీ పూర్తి చేశారు. నాలుగేళ్ల బాబు పాలనలో 4 కి.మీ సొరంగం తవ్వలేదు. ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చేసిన మోసం ఇది.“ అన్నారు. బమన ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మీ అందరి మన్నలు పొందుతానని చెప్పారు.

ఈ సందర్భంగా నవరత్నాల్లోని అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చేస్తామని, విద్యార్థికి ఏడాదికి రూ.20వేల మెస్ బిల్లు చెల్లిస్తామన్నారు. చంద్రబాబు ముష్టి వేస్తున్నట్లు రూ.30-35వేలు ఇస్తున్నారన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు బీసీల మీద ప్రేమ చూపి నాలుగు కత్తెరలు, ఇస్త్రీలు ఇచ్చి స‌రిపెట్టుకుంటున్నార‌ని చెప్పారు. ఎన్నికలు అయ్యాక బీసీలను చంద్రబాబు తంతారని ఆరోపించారు. మీ పిల్లల్ని ఏం చదివిస్తారో చదివించండి. ఆ ఖర్చంతా నేను భరిస్తా అని జగన్ హామీ ఇచ్చారు. పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే పేదరికం నుండి కుటుంబాలు బయటకు వస్తాయన్నారు.

“ప్రతి అవ్వకు, తాతకు పింఛను రూ.2వేలు ఇస్తాం. పింఛన్ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే రూ.2వేలు ఇస్తాం.“ అనే హామీల వ‌ర్షం కురిపించారు. క‌నిగిరి స‌భ‌లో వైసిపి క‌నిగిరి ఇన్‌ఛార్జి బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ చేతికి వెండి క‌త్తి ఇచ్చి చెయ్యిని పైకెత్తి విజ‌యోత్సాహం చూపించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ ప‌ర్చారు. యాత్ర ఆసాంతం ప్ర‌జాస‌మూహంతో సాగింది.