ఒంగోలు : సైకాలజీని వృత్తి విద్యా కోర్సుగా వచ్చే విద్యా సంవత్సరం నుండి నిర్వహించాలని ప్రోగ్రసీవ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు హిప్నో కమలాకర్ కోరారు. ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఒంగోలులో విలేకర్లతో మాట్లాడారు. ప్రజల విపరీత ప్రవృత్తులు, చెడు అలవాట్లు, వ్యసనాలు శాంతిబద్రతల సమస్యలు సృష్టిస్తున్నాయన్నారు. ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్య లోపాలు, వివిధ శాఖల ఉత్పాదక సామర్ధ్యాన్ని తగ్గించి రాష్ట్ర, దేశ అభివృద్దిని కుంటు పరుస్తున్నాయన్నారు. విద్యార్ధులు అత్యధిక సమయం విద్యాలయాల్లో గడపపడంతో కుటుంబ బంధాలు, అనుబంధాల మాధుర్యానికి దూరమై విలువలు కూడా మర్చిపోతున్న కారణంగానే ఈవ్‌టీజింగ్, ర్యాగంగ్, ప్రేమోన్మాద దాడులు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటి మానసిక దౌర్భల్య పరిస్థితులకు లోనవుతున్నారని చెప్పారు. సహజ వనరులు సమృద్దిగా ఉన్నా వినియోగించుకునే విధంగా మానవ వనరులను అభివృద్ది చేసుకునే ప్రయత్నం కొరవడిందన్నారు. ఇలాంటి పరిస్థితులను సరిదిద్దగలిగే మనో వైజ్ఞానిక రంగం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు.
కోర్టు తీర్పును సమర్ధవంతంగా అమలు చేయాలి
విద్యార్ధుల మానసిక స్థితిపై రాఘవన్ కమిటి నివేదిక ప్రతిపాదన మేరకు 2009మే 8న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధవంతంగా అమలు చేయాలని హిప్నో కమలాకర్ కోరారు. తీర్పు తొలిపేరాలోనే ప్రతి కళాశాల సైకాలజిస్టును కలిగి ఉండాలని లేదా సైకాలజిస్టు సేవలను వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో తాను ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లోని 23జిల్లాలు తిరిగి సైకాలజిస్టులను కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సంఘం ఒత్తిడితో 2010మార్చి 10న జిఒఎంఎస్ 19విడుదల చేసినట్లు చెప్పారు. జిఒ ప్రకారం ప్రతి విద్యాసంస్థ 6వ తరగతి నుండే కౌన్సిలర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిఒ ప్రకారం సైకాలజిస్టులను నియమిస్తే 30వేల మంది సైకాలజిస్టులు అవసరమని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2వేలమందికి మించి సైకాలజిస్టులు లేరన్నారు. వీరు కూడా వివిధ ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సైక్రియాటిస్టులు, క్లినికల్ సైకాలజీ కోర్సులు వైద్యవసరాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్నారు. సమాజ అవసరాలకు ఉపయోగపడే సైకాలజీ కోర్సు వృత్తి విద్యా లక్షణాలు ఉన్నప్పటికీ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ స్థాయిలో అకడమిక్ కోర్సుగా నిర్వహఙంచాలని కోరారు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్య విధానాలన్నింటి విద్యాబ్యాసం పూర్తయిన అనంతరం కౌన్సిల్‌లో నమోదు చేసుకోవడంతోపాటు వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుందన్నారు. అలాగే న్యాయ విద్య చదివిన వారికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇస్తున్నట్లే సైకాలజి పూర్తి చేసుకున్న వారికి గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. రిహాబిలిటేషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ మాస్టర్ డిగ్రీలు చేసిన వారిని గుర్తించడంలేదన్నారు. అందుకే సైకాలజిస్టులకు గుర్తింపు వ్యవస్థను జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇంటర్ తర్వాత 4 లేక 5ఏళ్ల వృత్తి విద్యా కోర్సుగా కౌన్సిలింగ్ సైకాలజీ కోర్సును ప్రభుత్వం ప్రారంభించాలని కోరారు.