హైదరాబాద్: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్‌టిఆర్) జీవితం ఆధారంగా చిత్రీకరిస్తున్న ఎన్‌టిఆర్ బయోపిక్ చిత్రంలో ఎన్‌టిఆర్ పాత్రలో ఎన్‌టిఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఆ చిత్రంలో ఎన్‌టిఆర్ అల్లుడు చంద్రబాబు పాత్రకు దగ్గుబాటి రాణాను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన చంద్రబాబు పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రాణా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆదివారం కలిశారు. సినిమా గురించి చంద్రబాబుతో చర్చించారు.
సమావేశంలో ఎన్‌టిఆర్ తనయుడు, హీరో బాలకృష్ణ, చిత్ర దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటిస్తున్నందుకు చాలా గౌరవంగా ఫీలవుతున్నా. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సర్’ అని రాణా పేర్కొన్నారు.
దగ్గుబాటి రాణా.. చంద్రబాబు హావభావాల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తూ, చంద్రబాబు తరహా గెటప్ ధరించి టెస్ట్ షూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌లో రాణాపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పలువురు తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో హీరో దగ్గుబాటి రాణా.. జోగేంద్ర అనే రాజకీయ నాయకుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత ఇప్పుడు ‘ఎన్టీఆర్’ చిత్రంలో సీఎంగా కన్పించబోతుండడంతో ఆయన పాత్రపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.