చీరాల : తిరగని హాసిటల్ లేదు. ఇక తిరగడానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. దగ్గరి మిత్రుల ద్వారా తెలిసి వైద్యం కోసం వస్తున్నా… సుమారు ఆరు నెలలుగా చూయించుకుంటున్నా. షుగర్ ప్రస్తుతం ఇబ్బంది పెట్టడంలేదు. మందులు లేవన్న భయం, ఆందోళన లేదు. స్వామివారి వద్దకు వచ్చామన్న నమ్మకం. అంతే ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య బాధలేకుండా రోజులు దొర్లుతున్నాయని చిలకలూరిపేటకు చెందిన షుగరు వ్యాధిగ్రస్తులు ప్రభాకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆనందకరమైన మాటలు వైద్యశిభిరానికి వస్తున్న అందరినోటా వినిపించడం హర్షించదగిన విషయం.
ప్రకాశం జిల్లా చిరాల మండలం వాడరేవు శ్రీశ్రీశ్రీ రామనంద సరస్వతి ఆశ్రమం ఆవరణలో ప్రతినెలా నాలుగో ఆదివారం ఉచిత షుగరు వైద్యశిభిరం నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 25నెలలుగా క్రమం తప్పకుండా ప్రతినెలా సుమారు 1500నుండి 1650మంది వరకు రోగులు హాజరవుతున్నారు. గుంటూరు వైద్యకళాశాల విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజారాజేశ్వరి పర్యవేక్షణలో వైద్యబృందం రోగులకు వైద్య పరీక్షలు చేస్తుంటారు. రక్తపరీక్షలు, బిపి, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలు చేసిన తర్వాత రిపోర్టులు ఆధారంగా రోగికి నెలరోజులకు అంటే మళ్ళీ వైద్య శిబిరం జరిగేవరకు సరిపడు మందులు ఉచితంగా అందిస్తున్నారు.
దూరప్రాంత రోగులు ముందురోజు రాత్రే శిబిరం వద్దకు చేరుకుంటున్నారు. వైద్య బృందం వేకువజాము నుండే పరీక్షలు చేయడం ప్రారంభిస్తున్నారు. ట్రస్ట్ ప్రతినిధులు హాజరైన రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్పాహారం, తాగునీరు ఉచితంగా అందిస్తున్నారు. ఆదివారం జరిగిన వైద్యశిభిరం 1612మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా నెలకు సరిపడు మందులు పంపిణీ చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్ చంద్ర, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ రవికాంత్, డాక్టర్ సుధాకర్ యాదవ్ వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, మేనేజర్ ఎన్ సురేష్, గోపాల్, బసవరావు, ఎంజి శంకరరావు, వాడరేవు జెడ్పి ఉన్నత పాఠశాల, చీరాల ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.