Home జాతీయం అన్నదాతలకు మోడీ చరిత్రాత్మక ద్రోహం… దేశ వ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతున్న రైతులు

అన్నదాతలకు మోడీ చరిత్రాత్మక ద్రోహం… దేశ వ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతున్న రైతులు

529
0

అమరావతి : ”నాది 56 అంగుళాల ఛాతీ. నన్ను ప్రధానిగా గెలిపించండి. అచ్చేదిన్ తెస్తా.” అంటూ ఎన్నికలకు ముందు ప్రధాని చేసిన భాషలు ఉత్త ఊసులేనని నేటి ప్రకటనతో తేలిపోయింది. దేశంలోని సకల జనాలను ప్రధాని మోడీ నిలువునా మోసం చేసారు. పంటలకు కనీస మద్దతు ధరల పెంపుపై కేంద్రం ప్రకటించింది. ఆ ప్రకటన అన్నదాతల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. అరకొర పెంపుతో విదిలించినట్లు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎంఎస్పీలతో రైతాంగం నివ్వెరపోయింది. ఖరీఫ్‌ నుంచి పంటలకు ఉత్పత్తి వ్యయం కంటే 50శాతం లాభదాయకంగా కనీస మద్దతుధర దక్కేట్లు తీసుకున్న నిర్ణయాన్ని రైతు సంఘాలు నిరసించాయి. ఇది చారిత్రక ద్రోహం అని అఖిలభారత కిసాన్‌ సభ దుమ్మెత్తింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుల్ని వంచించారని ఆరోపించింది. ‘స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం ఎంఎస్పీ నిర్ధారిస్తారని ఆశలు కల్పించారు. కానీ కేవలం రైతుకయ్యే ఖర్చును, కుటుంబ కూలీగా అయ్యే మొత్తాన్ని కలిపి చెల్లిస్తామని ప్రకటించారు. ఇది రైతుల్ని మోసం చెయ్యడమే’ అని కిసాన్‌ సభ దుయ్యబట్టింది.

కేంద్రం చేసిన ఈ మోసాన్ని నిరసిస్తూ ఆగస్టు 9న సామూహిక జైల్‌ భరో, సెప్టెంబరు 5న కిసాన్‌ సంఘర్షణ ర్యాలీ నిర్వహించాలని అఖిల భారత కిసాన్‌ సభ పిలుపునిచ్చింది. కాగా, రైతాంగ దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆగస్టు 9నుంచి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా దేశంలోని అన్ని రాష్ట్రాల మీదుగా రైతు యాత్ర చేపట్టనున్నట్లు 130 రైతు సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌ ప్రకటించింది. ఇక పద్నాలుగు ఖరీఫ్‌ పంటలకు కేంద్రం బుధవారం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతాంగం ఆశలపై నీళ్లు జల్లినట్లు విశ్లేషకుల పరిశీలనలో తేలింది. ‘‘ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ఇవ్వాలన్నది మా నిర్ణయం. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను పరిశీలించి, వాటి ఆధారంగా దీన్ని కొద్ది నెలల్లో అమలు పరుస్తాం’’ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్‌లో పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ అన్నింటినీ లెక్కగడుతుందని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఉత్పత్తి వ్యయాన్ని రెండు రకాలుగా లెక్కగడతారు.

1) విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, కూలీ (మానవ, జంతు లేదా యాంత్రిక), ఇరిగేషన్‌, ఇతరత్రా ఖర్చులన్నింటినీ కలిపి ఏ2 అని పిలుస్తారు. దీనికి కుటుంబ కూలీ (ఎఫ్ఎల్‌) కలుపుతారు. అంటే ఎ2+ఎఫ్ఎల్‌
2)ఇక దీనికి భూమి లీజుకు తీసుకున్న వ్యయం కూడా కలుస్తుంది. ఆ మొత్తం ఖర్చును ‘‘సమగ్ర వ్యయం- సీ2’’ అని అంటారు. అంటే సీ2 = ఏ2+ఎ్‌ఫఎల్‌+భూమి లీజు వ్యయం.

స్వామినాథన్‌ సూచించినదేంటంటే సీ2కి ఒకటిన్నర రెట్లు రైతుకు చెల్లిస్తేనే కొంతవరకు రైతు పెట్టిన ఖర్చుకు రాబడి లభించినట్లవుతుంది. రైతు సంఘాలు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఏ2+ఎఫ్ఎల్‌ కి ఒకటిన్నర రెట్లు మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. అంటే భూమి లీజుకు పెట్టే ఖర్చును కలపలేదు. ఉదాహరణకు వరినే తీసుకొంటే ప్రభుత్వం ప్రకటించిన ఎంఎఎఫ్పీ ప్రకారం క్వింటాలుకు రూ.1750. కానీ 2017-18లో వ్యవసాయ ధరల కమిషన్‌ సీ2 ఫార్ములా ప్రకారం ఉత్పత్తి వ్యయం రూ.1484. దీనికి 1.5 రెట్లు ఎంఎఫ్పీ అంటే రూ.2226 చెల్లించాలి. కానీ 1750 మాత్రమే నిర్ణయించారు. అంటే క్వింటాలుకు రూ.476 తక్కువ కావడంతో దేశం యావత్తు ఈ అంశంలో రగిలిపోతుంది.