Home ప్రకాశం రైతుల దాన్యం డబ్బు రు.10కోట్లు చెల్లించాలి : మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు

రైతుల దాన్యం డబ్బు రు.10కోట్లు చెల్లించాలి : మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు

324
0

చీరాల : ధాన్యం అమ్ముకున్న రైతులకు రావాల్సిన 10 కోట్ల రూపాయల డబ్బును ప్రభుత్వ నిబంధనల పేరుతో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు నిలిపివేశారని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఆరోపించారు. చీరాల మండలం ఈపూరుపాలెం పంచాయతీ పరిధిలోని బోయినవారిపాలెంకు చెందిన రైతులు అప్పులు బాధలు తట్టుకోలేక వరి ధాన్యమును రైస్మిల్లర్స్ కు బస్తా రూ.1100కు అమ్ముకున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మలేదని, రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి, రైతులకు రావాల్సిన డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, జిల్లా జాయింట్ కలెక్టర్ మాత్రం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల బోయినవారిపాలెంలో రైతులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి, గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి జేసీ పునాదులు వేశారని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ వ్యక్తిగతంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పారు. జనసేన టిడిపి పార్టీలను బలోపేతం చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారా అని అనుమానం వస్తుందన్నారు. ఉన్నతంగా చదువుకొన్న జేసీ లాంటి వ్యక్తులు, రైతుల పట్ల వివక్షత చూపిస్తే, వైసిపి మరల అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, ఇన్చార్జి వెంకటేష్ బాబు మాట్లాడిన కూడా జెసి స్పందించలేదన్నారు. బోయినవారిపాలెం గ్రామ రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బాపట్లలోని జాయింట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.