Home జాతీయం తిరిగిరాని లోకానికి అటల్ జీ

తిరిగిరాని లోకానికి అటల్ జీ

369
0

ఢిల్లీ : రాజనీతిజ్ఞుడు, ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నేత అటల్ బిహారి వాజపేయి అస్తమించారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ప్రధాని వాజపేయి తిరిగి రాని లోకానికి తరలిపోయారు. పదవి ద్వారా తనకి కాకుండా తన ద్వారా పదవికి వన్నె తెచ్చిన రాజకీయ శిఖరం నేలకు ఒరిగింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) గురువారం కన్నుమూశారు. 9ఏళ్ల అనారోగ్యం, తొమ్మిది వారాల విషమ స్థితి నుంచి ఆయన విశ్రమించారు. 9 వారాలుగా ఎయిమ్స్‌లో మృత్యువుతో పోరాడి గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత మంగళవారం నుండి ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందారు.

దీంతో వాజపేయిని చూసేందుకు ప్రధాని ప్రోటోకాల్‌ నిబంధనల్నీ పక్కనబెట్టారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజపేయి 2005 డిసెంబరులో క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన ముందే చెప్పారు. అప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహించిన లఖ్‌నవ్‌ నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన లాల్‌జీ టాండన్‌ను బలపరుస్తూ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ప్రచారానికి కూడా రాలేకపోతున్నానని పేర్కొన్నారు.

అనంతరం 2009 ఫిబ్రవరి 6న వాజపేయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఎయిమ్స్‌లో చేరి.. కొంతకాలానికి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన గుండెపోటు, పక్షవాతం రావడంతో మాట దెబ్బతిన్నది. ఆపై జ్ఞాపకశక్తి కోల్పోయారు. క్రమంగా మధుమేహం తీవ్రతరమైంది. మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన కిడ్నీల్లో ఒకదానిని గతంలోనే తొలగించారు. కాగా మూత్రపిండాలు దెబ్బతినడం వల్లనే జూన్‌ 11న ఆయన మళ్లీ ఎయిమ్స్‌లో చేరారు.