Home ప్రకాశం వెలుగొండ జలాలతోనే కరవు నివార‌ణ : ఐదోరోజు పాదయాత్రలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

వెలుగొండ జలాలతోనే కరవు నివార‌ణ : ఐదోరోజు పాదయాత్రలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

517
0

మార్కాపురం : వెలుగొండ జలాలతోనే ప‌శ్చిమ ప్ర‌కాశం కరవు పోతుందని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం ఆయ‌న‌ తలపెట్టిన ప్రజా పాదయాత్ర శనివారం ఉదయం వెలుగొడస్వామి ఆలయం నుండి ప్రారంభమైంది. తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లి, మేకలోడిపల్లి, ఓబాయపల్లి, జగన్నాధపురం, తుమ్మలచెరువు వరకు 15 కిలోమీటర్లకుపైగా సాగింది. లక్ష్మక్కపల్లిలో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నట్లు గ్రామస్తులు ఆయ‌న ఎదుట‌ వాపోయారు. తమ క‌ష్టాలు చెప్పుకునేందుకు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. కన్నబిడ్డల నిరాదరణకు గురై బతికే మార్గం లేక పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు పట్టించుకోలేదని ఎనభై ఏళ్ల రంగమ్మ సుబ్బారెడ్డి ఎదుట బావురుమంది. మేకలోడిపల్లెలో రైతు కూలీలలతో ఆయ‌న‌ మాట్లాడారు. నాగలిపట్టి దున్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారానికి వస్తే రైతులు పండించే ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గొర్రెలు, మేకల పెంపకందార్లతో మాట్లాడారు. వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తుమ్మలచెరువు గ్రామప్ర‌జ‌లు మంచినీటి సమస్య తీవ్రతను మాజీ ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలక ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. పశ్చిమ ప్రాంతం పట్ల చంద్రబాబు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసరెడ్డి, కేపీ కొండారెడ్డి, పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, బట్టపురి వెంకటసుబ్బారెడ్డి, కంది ప్రమీలారెడ్డి, షేక్‌ వహీదా, చెంచమ్మ, రాయి భాషాపతిరెడ్డి పాల్గొన్నారు.