Home జాతీయం బై ఎలక్షన్ ఫలితాలతో ఎన్డీయేలో చిచ్చు…? 

బై ఎలక్షన్ ఫలితాలతో ఎన్డీయేలో చిచ్చు…? 

509
0

అమరావతి : బీజేపీ, మోడీ పలుకుబడి రోజు రోజుకు పలుచ బడుతుంది. ఫలితాల్లో గ్రాఫ్ పతనమౌతుండడంతో ఎన్డీయే పక్షాల్లో ఆందోళన మొదలైంది. ఈ కూటమిలో కొనసాగితే మోడీ మీద ఉన్న వ్యతిరేకత తమకు చుట్టుకుంటుందన్న భయం ఎన్డీయే పక్షాలను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఎన్డీయే కూటమి నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ఎన్డీయేలో లుకలుకలు పెరిగాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు ఎన్డీయే పక్షలను మరింత ఆత్మ రక్షణలోకి నెట్టేశాయి. దీంతో ఎన్డీఏ కూటమిలో ఉక్కపోత మొదలైంది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలకు ఊపిరి సలపడం లేదు. కూటమిని వదిలేసి ఎప్పుడు బయటపడదామాని దారులు వెతుక్కుంటున్నాయి. గతంలో మనుగడ కోసం బీజేపీ చేతిలో అవమానాలను దిగమింగుకున్న పార్టీలు ఇప్పుడు తమను గెలిపించలేని పెద్దన్న దగ్గర ఊడిగం అవసరం లేదనే నిర్ణయానికి వచ్చాయి. మిత్రధర్మం ఇదేనా అంటూ కొన్ని సూటిపోటి మాటలు విసురుతుంటే, మరికొన్ని మాకేదీ గౌరవం అంటూ యుద్ధానికే దిగుతున్నాయి. ప్రత్యేక హోదా అంశంపై టిడిపి ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుండి కూటమిలో అభిప్రాయభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

2014 ఎన్నికల అనంతరం మధ్యలో ఎన్డీఏలో చేరిన జేడీయూ ఇప్పుడు బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల దాకా బీజేపీతోనే కూర్చుంటే రాజకీయ పార్టీగా అంతర్థానం అయిపోతామనే భయం మొదలైంది. 2014 ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ 31 గెలుచుకుంది. జేడీయూ రెండుచోట్లే నెగ్గింది. 2019లో బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి వస్తే 2014లో గెలిచిన రెండు సీట్ల లెక్కన తమకు తక్కువ సీట్లు కేటాయిస్తుందేమోనన్న భయం జేడీయూని వెంటాడుతోంది. దీన్ని నివారించేందుకే ముఖ్యమంత్రి నితీశ్‌ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. అసొం పౌరసత్వ చట్టానికి లోక్‌సభలో ఆమోద ముద్ర పడకుండా అడ్డుకోవాలని అఖిల అసొం విద్యార్థి సంఘం (ఆసు) చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు.

ఇటీవల 9 జిల్లాల్లో బీజేపీ నేతల ప్రమేయంతో మత ఘర్షణలు రేగడం కూడా నితీశ్‌కు ఆగ్రహం కల్గించింది. ఇక మహారాష్ట్రలో పాల్ఘార్‌లో తొలిసారిగా దీర్ఘకాల మిత్రపక్షాలైన బీజేపీ- శివసేన ఢీకొన్నాయి. బీజేపీ చేతిలో శివసేన ఓడిపోయింది. మహారాష్ట్రలో మేమే పెద్ద పార్టీ అంటూ బీజేపీ కాలరెగరేస్తోంది. శివసేన గాయాలకు కారం రాస్తోంది. బీజేపీ ఎలక్షన్‌ కమిషన్‌తో కుమ్మక్కైందనీ, ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే ఓడిపోయామనీ శివసేన వ్యాఖ్యానించింది. కాంగ్రె్‌సకు లాభం చేకూర్చే ఏ పనీ ఉద్ధవ్‌ చేయరనే ధీమా బీజేపీని ఎంతకైనా తెగించేట్లు చేస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో తమకు ఆశించిన స్థాయిలో పదవులు అందలేదని, ఏ కీలక నిర్ణయం తీసుకున్నా తమను సంప్రదించడం లేదని అకాలీదళ్‌ అసంతృప్తిగా ఉంది. కశ్మీర్‌లోనూ కఠువా ఉదంతం తర్వాత తెగతెంపుల వరకు వెళ్లింది.

రాంమాధవ్‌ ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించడంతో ప్రస్తుతానికి రాజీ కుదిరింది. బీజేపీకి, ఎల్జేపీకి మధ్య అంతరం పెరిగింది. కొత్త వాటి కోసం వల వేద్దామా? అంటే ఎవరూ సిద్ధంగా లేరు. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ది స్వతంత్ర వైఖరి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత జగన్‌ వ్యక్తిగత కారణాలతోబీజేపీతో మంచిగా ఉంటున్నారు. తమిళనాట అన్నాడీఎంకే మోదీకి దగ్గరైనా దానికి ప్రజల్లో విశ్వసనీయత లేదు. దాంతో చేతులు కలిపినందుకు బీజేపీకే నష్టం జరిగే పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీలోనూ ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు యోగి ప్రభుత్వం అవినీతి మయమై పోయిందని ధ్వజమెత్తారు. ఆయన పాలనలో కన్నా అఖిలేశ్‌ హయాంలోనే అవినీతి కాస్త తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలపై శ్యామ్‌ ప్రసాద్‌ అనే బీజేపీ ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎందుకు ప్రజలు ఓటేస్తారు? అని ఘాటుగా విమర్శించారు. సురేంద్రసింగ్‌ అనే మరో బీజేపీ ఎమ్మెల్యే ‘‘అవినీతి అధికారుల రాజ్యమిది. వారు ప్రజలను నానా యాతనకు గురిచేస్తున్నారు. ఈ ఫలితాలు బీజేపీకి ఓ గుణపాఠం’’ అని వ్యాఖ్యానించారు.

ఇద్దరి స్పందనలూ కొడిగడుతున్న యోగి ప్రభకు సంకేతాలని అంటున్నారు. బీజేపీలో మోడీ తర్వాత అంతటి జనాకర్షణగల నేతగా పేరొందిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వరుసగా నాలుగో ఓటమి. గతంలో ఆయన ఫూల్పూర్‌, గోరఖ్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు చవిచూశారు. పార్టీ తరఫున ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు ఆయన్ను పంపడం వల్ల నష్టమే ఎక్కువని బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. మోడీ మ్యాజిక్‌కు కూడా కాలం చెల్లిందని కైరానా ఫలితం చెబుతోంది. పోలింగ్‌కు ఒకరోజు ముందు ఆయన బాగ్‌పట్‌లో ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. బహిరంగసభకు కైరానా నుంచి భారీగా ప్రజల్ని తీసుకొచ్చినా మోడీ ప్రభావం కనిపించలేదు.