బెంగుళూరు : ఒకరు మాజీ సీఎం… ఆయన తండ్రి మాజీ పీఎం… వీరిద్దరూ కర్ణాటక రాజకీయాల్లో కీలకమైన నేతలు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వీరిద్దరి మధ్య చిచ్చురేపుతున్నాయి. తండ్రి… కొడుక్కి బహిరంగంగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా… ఎన్నికల తరువాత మోడీతో కానీ, బీజేపీతో కానీ కుముక్కు ఐనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక పార్టీ రాష్ట విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఆ కుమారుడిపై ఆ తండ్రి చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. విరెవరో కాదు. మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ ఆయన కొడుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక కర్ణాటకలో జేడీఎస్ ని నడుపుతూ ప్రస్తుత ఎన్నికలో తలపడుతున్నారు. కర్ణాటకలో ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చాలినంత మెజారిటీ రాదని అన్ని సర్వేలు తేల్చాయి. అదే సమయంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని ఆ సర్వేలు తేల్చాయి. దాంతో ఎన్నికల తరువాత కుమారస్వామి ఏ స్టాండ్ తీసుకుంటారన్న విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ నేపద్యంలోనే దేవెగౌడ్ తన కుమారుడిపై ఘాటు హెచ్చరికలు చేశారు.
ఎట్టిపరిస్థితుల్లో తాము బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని దేవెగౌడ్ స్పష్టం చేశారు. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కమలనాథులతో కుమ్మక్కైతే కుటుంబం నుంచి అతడిని వెలివేస్తానని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. బెంగళూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు చెబుతున్నాయని అందుకే జేడీఎ్‌సపై కుట్ర సాగుతోందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీకి జేడీఎస్ బీ-టీమ్‌గా ఉందని ఆరోపించారన్నారు. అప్పటినుంచే ఈ ప్రచారం సాగుతోందన్నారు.
అమిత్‌షాతో కలసి కుమారస్వామి విమానంలో ప్రయాణించారనేది అవాస్తవమన్నారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. సీఎం దగ్గర ఆధారాలుంటే బహిర్గతం చేయాలన్నారు. కుమారస్వామి, బీజేపీతో చేతులు కలిపి ఉంటే ఆయనను ఇంటి నుంచి, పార్టీ నుంచి బహిష్కరిస్తానన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. బీజేపీకి తాము సహకరించేది లేదని ఎన్నికలకు ముందే దేవెగౌడ కుండా బద్దలు కొట్టడంతో బీజేపీ నేతలు కూడా సందిగ్ధంలో పడ్డారు.
విశ్లేషణలు చూసి గెలుపుపై నమ్మకం కోల్పోయిన బీజేపీ నేతలు దింపుడు కళ్లెం ఆశలతో ఎన్నికల కంపెయిన్ నడుపుతున్నారు. అందుకే అవినీతి పరుడైన గాలి జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి రానిచ్చేది లేదని చెప్పిన అమిత్ షా ఇటీవల యూ టర్న్ తీసుకున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి ఏకంగా 8 సీట్లు కట్టబెట్టి పార్టీ గెలుపు బాధ్యతలను ఆయన చెతిలో పెట్టారు. ఇక మంగళవారం నుంచి కర్ణాటకలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మొత్తం ఐదు రోజుల్లో 15 సభలతో రాష్ట్రాన్ని చుట్టి రావాలని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.