Home జాతీయం ఎన్నిక‌ల్లో ధ‌న ప్రమేయం ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాదం : బీవీ రాఘవులు

ఎన్నిక‌ల్లో ధ‌న ప్రమేయం ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాదం : బీవీ రాఘవులు

518
0

హైదరాబాద్ : ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌మేయం పెర‌గడం ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాద‌మ‌ని సిపిఎం పొలిట్ బ్యూరో స‌భ్యులు బివి రాఘ‌వులు పేర్కొన్నారు. పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో నిధులు ఇవ్వడం అనేది ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌మ‌న్నారు. ఎవ‌రు ఎవ‌రికి ఎంత ఇస్తున్నార‌నేది కూడా తెలియ‌ని ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నారు. దీని వల్ల ఎన్నికల్లో ధనమే కీలక భూమిక పోషించే ప్రమాదముందన్నారు. బాండ్ల రూపంలో నిధులు ఇవ్వ‌డాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ నెల 27న రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ నిర్వహించే సమావేశంలో ఈ ర‌క‌మైన‌ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు వివిధ అంశాలపై చర్చించామ‌న్నారు.

దేశంలో ఉన్న విదేశీ కంపెనీల బ్రాంచీల నుండి కూడా నిధులు తీసుకునే సౌలభ్యాన్ని నూత‌న విధానంలో కల్పించారని రాఘ‌వులు చెప్పారు. ఇలాంటి విధానాల వల్ల ఓట్లు కొనుక్కునే విధానాన్ని ప్రోత్సహించినట్లు ఉంటుందని అన్నారు. ఈవీఎంలను కొనసాగించాలని కోరారు. ఇవిఎంల విషయంలో ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధమని సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌బ‌ద్రం పేర్కొన్నారు. టిఆర్ఎస్ త్రిబుల్ బెడ్‌రూం, డ‌బుల్ బెడ్రూం విధానాల‌తో కొత్త‌గా పేద‌ల‌కు ఇళ్లు రాక‌పోగా క‌నీసం ఇంటి స్థ‌ళం ప్ర‌భుత్వం కొనుగోలు చేసి ఇచ్చే విధానం కూడా పోయింద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌జ‌లు చేసిందేమీ లేద‌న్నారు. అందుకే టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్న‌యంగా బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని పేర్కొన్నారు.