Home ప్రకాశం కడవరకు ఎర్రజెండా వీడని ఆదర్శనేత కామ్రేడ్‌ చాగంటి వెంకటేశ్వర్లు

కడవరకు ఎర్రజెండా వీడని ఆదర్శనేత కామ్రేడ్‌ చాగంటి వెంకటేశ్వర్లు

412
0

ఎర్రజెండా అంటే అమితమైన ప్రేమ. ఆ జెండాను చూస్తే ఎంతో ఉత్సాహంగా జనంతో ఇట్టే కలిసిపోయే మనిషి. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో కమ్యునిస్టు ఉధ్యమంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిందీ ఆయన వ్యక్తిత్వమే. ఏదైన పని పట్టుకుంటే సాధించే వరకు వదిలే మనిషి కాదు. కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యతో నేరుగా పరిచయం ఉన్న వ్యక్తుల్లో ఆయనొకరు. నమ్మిన సిద్దాంతం కోసం కడవరకు నిలబడి ఆచరించిన వ్యక్తి. ఆయనే పర్చూరు మండలం నాగులపాలెంకు చెందిన సిపిఎం నాయకులు కామ్రేడ్‌ చాగంటి వెంకటేశ్వర్లు. 94ఏళ్ల వయస్సులో ఆయన తుదిస్వాస విడిచారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో తన మనమడు విజయభాస్కర్‌తో మాట్లాడుతూ తనను చివరి రోజు ఎర్రజెండాతో పంపాలని కోరాడటం. ఆయన కోరిక మేరకు అంతిమ యాత్రలోనూ ఎర్రజెండా కప్పి తీసుకెళ్లారు. సిపిఎం జిల్లా, రాష్ట్ర నాయకత్వం కూడా అంతిమ యాత్రకు హాజరయ్యారు.

కామ్రేడ్‌ చాగంటి వెంకటేశ్వర్లు సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయారు. తన నలుగురు అక్కలు, అమ్మ బాధ్యత తన భుజాన వేసుకొని కుటుంబాన్ని నడిపిన వ్యక్తి. ఆ క్రమంలో రైతు నుంచి కాంట్రాక్టర్‌గా మారారు. కాంట్రాక్టర్‌గా ఆయన నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆ కట్టడాల నాణ్యత పటిష్టత గురించి ఆ తరం ప్రజలు కథలుగా చెప్తారు. యువకుడిగా సామ్యవాదం పట్ల ఆకర్షితులయ్యారు. సామ్యవాదం నుండి కమ్యునిస్ట్ పార్టీ వైపు మొగ్గుచూపారు. కమ్యునిస్టు పార్టీ విభజన సమయంలో సిపిఎం వైపు నడిచారు. ప్రకాశం జిల్లా కమ్యునిస్ట్ పార్టీ అభివృద్ధికి, నిర్మాణానికి కృషి చేశారు. పేదల పక్షపాతిగా రైతు కూలీ సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. బడుగు బలహీనవర్గాలకు ఏదైనా సమస్య వస్తే మొదట చూసేది తన వైపే. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా లేని చాగంటి వెంకటేశ్వర్లు పట్టుదలతో రాయడం, చదవడం నేర్చుకొన్నాడు. కుటుంబాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ ఆయన జీవిత ప్రయాణం మార్గదర్శకంగా నిలిచింది. కుటుంబం బాగుంటేనే ఇతర కార్యక్రమాలు బాగా చేయగలం, సమాజానికి ఉపయోగపడగలమని ఆయన ఎప్పుడు చెప్పేవారు. వ్యవసాయం తప్ప ఏమి తెలియని ఆయన మర్కిజం గురించి, రాష్ట్ర, దేశ రాజకీయాలు, అంతర్జాతీయ కమ్యునిస్ట్ ఉద్యమ చరిత్ర గురించి చెప్పడం వల్లనేనేమో వాటి పట్ల చిన్నతనంలోనే ఆకర్షితుడయ్యనని ఆయన మనవడు చాగంటి విజయభాస్కర్‌ చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ భావజాలంకు అప్పట్లోనే తనకు బీజం పడిందని చెబుతారు. తెలుగుదేశం ఆవిర్భావానికి పూర్వం గ్రామ రాజకీయం కాంగ్రెస్, కమ్యునిస్ట్ పార్టీల మధ్యనే ఉండేది. అయినా రాజకీయ ప్రత్యర్థుల మధ్య పరస్పర గౌరవ మర్యాదలు ఉండేవి.

కమ్యునిస్టులపై నిషేధ కాలంలో…
ఇందిరాగాంధీ కాలంలో కమ్యునిస్ట్ పార్టీపై నిషేధం విధించారు. అప్పట్లో కమ్యునిస్టు నాయకులు బహిరంగంగా కనిపిస్టే పోలీసులు అరెస్టు చేసేవాళ్లు. జైళ్లలో పెట్టేవాళ్లు. కొన్ని సందర్భాల్లో కాల్చి చంపారు కూడా. అలాంటి కాలంలో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యతో సహా అనేకమందికి మూడో కంటికి తెలియకుండా చాగంటి వెంకటేశ్వర్లు ఆశ్రయం ఇచ్చాడు. పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరుగా వెలిగారు. తన 94 ఏళ్ల సంపూర్ణ జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.

కమ్యునిస్టు పార్టీ సభ్యునిగా…
1954లో కమ్యునిస్టు పార్టీ సభ్యులుగా చాగంటి వెంకటేశ్వర్లు చేరారు. అప్పటి నుండి ప్రజాజీవితంలో పట్టుదలతో, క్రమశిక్షణతో పనిచేశారు. పాలేర్ల కూలి పోరాటం సందర్భంగా తానే తొలుత కూలి రేట్లు పెంచి ఔదార్యం చాటుకున్నారు. ఒంగోలు, చీరాల సిపిఎం కార్యాలయాల నిర్మాణానికి విశేష కృషి చేశారు. చీరాల, పర్చూరుల్లో రైస్ మిల్ల కార్మికుల పోరాటానికి మిల్లు యహమానిగా ఉండి సహకారం అందించారు. చీరాలలో 1985లో నాలుగు జిల్లాల విద్యార్థులు 4వందల మందికి 4రోజులపాటు రాజకీయ పాఠశాల నిర్వహణకు, 1987లో ఉమ్మడి రాష్ట్ర స్థాయి విద్యార్థి రాజకీయ పాఠశాల నిర్వహణకు, 1993లో మరోసారి రాష్ట్ర విద్యార్థి పాఠశాల నిర్వహణకు విశేష కృషి చేసారు. 1994లో చీరాలలో సిపిఎం జిల్లా మహాసభల నిర్వహణకు ఆయన సహాకారం అద్వితీయమైనది.

సిపిఐ ఎంఎల్‌ నాయకులు కామ్రెడ్‌ రామన్నరసయ్య అజ్జాత కాలంలో చాగంటి వెంకటేశ్వర్లు వద్దనే సురక్షితంగా ఉన్నారు. అప్పట్లో పార్టీ జాగ్రత్తల్లో ప్లేసు మార్చాలనే ఉద్దేశంతో చాగంటి ఇంటి నుండి తర ప్రాంతాలకు తరలించారు. వెళ్లిన మూడో రోజే పోలీసుల ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. మరో ఎంఎల్‌ నాయకులు కామ్రెడ్‌ తొండెపు బుచ్చయ్యకు ఎంతో సహకారం అందించారు. 1967లో పర్చూరులో సిపిఎం ఎంఎల్‌ఎగా నరహరిశెట్టి వెంకటస్వామి గెలుపొందారు. అప్పటి ఎన్నికల్లో సర్వం తానై చాగంటి వెంకటేశ్వర్లు కృషి చేశారు. గ్రామాల్లో ప్రచారం, ఎన్నికల ఆర్ధిక వనరులు సమకూర్చడం వంటి పనులన్నీ చాగంటి వెంకటేశ్వర్లు చేశారు. పర్చూరు మండలం నాగులపాలెంలో కుంటబడి ప్రాధమిక పాఠశాలను ఏర్పాటు చేసిందీ చాగంటి వెంకటేశ్వర్లు. గ్రామంలోని పల్లెలో ఏ శుభ కార్యం జరిగినా ఆయన సహకారం ఉండేది.

కారంచేడు ఘటనలో నిందితులకు ఆశ్రయం కల్పించారనే సాకుతో చాగంటి వెంకటేశ్వర్లు ఇంటిలో పోలీసులు సోదాలు చేయడాన్ని అప్పటి ప్రజాశక్తి సంపాదకులు మోటూరు హనుమంతరావు తప్పుపట్టారు. బాధ్యత కలిగిన కమ్యునిస్టు పార్టీ సిపిఎం నాయకుల ఇళ్లలో నిందితులను ఉంచారని పోలీసులు అనుమానించడం ఏమిటని ఎడిటోరియల్‌లో ప్రశ్నించారు.

క్లాస్ 1 కాంట్రాక్టర్‌గా చీరాల, పర్చూరు ప్రాంతాల్లో అనేక కట్టడాలు కట్టారు. కారంచేడు దొంగ తూములు, ఎత్తిపోతల పధకాలు, నాగులపాలెం వాటర్ ట్యాంకు (ఫిల్టర్ బెడ్స్) వంటి పనులకు ఆధికారులు పిలిచి పనులు ఇచ్చే వారు. అధికారులు నిర్ధేశించిన కాలానికన్నా ముదే పనులు పూర్తి చేసేవారు.

పర్చూరు మండలం నాగులపాలెం లోని ఆయన స్వగృహం వద్ద ఆగస్టు 15న సంతాప సభ నిర్వహించనున్నారు. సభకు సిపిఎం జిల్లా రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు.

డి విజయభాస్కర్, విలేఖరి,
పి కొండయ్య, చేతివృత్తుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్.