చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో ఆగష్టు 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీరాల వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్‌చంద్ తెలిపారు. చీరాల శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎన్ నాగలక్ష్మి, శిక్షణలో ఉన్న సహాయ కలెక్టర్ టి నిశాంతితో కలిసి ఐటిసి అతిధి గృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామదర్శిని, బహిరంగసభ, చేనేత ప్రదర్శన శాల, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, హెలిప్యాడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు.
ఈసందర్భంగా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ ఆగష్టు 7న ఉదయం గ్రామదర్శినిలో పాల్గొంటారని తెలిపారు. మద్యాహ్న భోజన విరామం తర్వాత చేనేత ఉత్సవం, బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం అనువైన ప్రదేశాలను, గ్రామాలను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. బహిరంగ సభ ప్రాంగణంలో 13జిల్లాలకు చెందిన చేనేత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. చీరాల విశిష్టతను తెలియజెప్పేవిధంగా ప్రదర్శన శాలలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాధమిక చేనేత వస్ర్తాలు, ఆధునిక పోకడలు, చేనేత వస్ర్తాలను వన్నెతెచ్చేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు. చేనేత సహకార సంఘాలన్నింటినీ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలన్నారు. గ్రామదర్శినికి వచ్చేందుకు, బహిరంగ సభ నుండి వెళ్లేందుకు రెండు చోట్ల హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వీటికి అవసరమైన స్థలాలు ఎంపిక చేయాలన్నారు. గ్రామదర్శినికి గ్రామం, చేనేతల నేపధ్యం ఉంటే బాగుంటుందన్నారు.
చీరాల ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ చీరాల చేనేత వస్ర్తాలకు గొప్ప పేరుందన్నారు. రూ.వెయ్యి కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులు తయారవుతున్నాయన్నారు. చీరాల బ్రాండ్‌ను ఘనంగా ప్రతిబింబించేవిధంగా ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలను పరిశీలించారు. బహిరంగ సభ కోసం కళాశాల ప్రాంగణంలో ఉన్న ఖాళీస్థలాన్ని పరిశీలించారు. సభకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో స్థళం ఖరారు చేశారు. దగ్గరుండి కొలతలు తీసి మార్కింగు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రవేశమార్గాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వేదిక, ప్రదర్శనలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల శిలాఫలకాలు, గ్యాలరీలు ఏర్పాట్ల గురించి చర్చించారు. కళాశాల పక్కనున్న ఖాళీ స్థలాన్ని హెలీప్యాడ్ కోసం పరిశీలించారు.
జాండ్రపేట, వేటపాలెం మద్య రహదారి వెంట ఉన్న ఖాళీ స్థలాలను పార్కింగు స్థలంగా కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. సదస్సుకు 40నుండి 50వేల మంది చేనేతలు అన్ని జిల్లాల నుండి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పందిళ్లపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాలను పరిశీలించారు. గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమాలకు అనువుగా ఉంటుందని చెప్పారు. పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్‌డిఒ కమ్మ శ్రీనివాసరావు, డిఎస్‌పి వల్లూరి శ్రీనివాసరావు, ఆర్అండ్‌బి ఎస్ఇ శివప్రసాద్‌రెడ్డి, సిఐ భక్తవత్సలరెడ్డి, ఆర్అండ్‌బి డిఇ శ్రీనివాసరావు, తహశీల్దారు వెంకటేశ్వర్లు, చేనేత, జౌళిశాఖ ఎడి శివనారాయణ పాల్గొన్నారు.