Home ఆంధ్రప్రదేశ్ మాట తప్పని నేత చంద్ర‌బాబు : దాసరి రాజా మాష్టారు..

మాట తప్పని నేత చంద్ర‌బాబు : దాసరి రాజా మాష్టారు..

481
0

కందుకూరు : “వస్తున్నా.. మీ కోసం“ పాదయాత్ర లో ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా ఇచ్చిన హామీలు అమ‌లు చేసిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుదేన‌ని టిడిపి రాష్ట కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, శిక్ష‌ణా భిశిరం డైరెక్ట‌ర్ దాస‌రి రాజా మాస్టారు పేర్కొన్నారు. రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆర్ధిక భార‌మైనా అమ‌లు చేస్తూ రాజ‌ధానిని రెండేళ్ల‌లోనే రాష్ట్రానికి తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు. ప్ర‌జా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టార‌న్నారు. పథకాల అమలు కోసం 68సంవ‌త్స‌రాల వయస్సులో ఆయన పడుతున్న తపనను అందరూ గమనించాలన్నారు. టిడిపి 153వ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు.

తెలుగు విజయం ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిక్షణకు హాజరైన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి రాజా మాష్టారు మట్లాడారు. రూ.24వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసామని, డ్వాక్రా మహిళలకు రూ.6వేలు రుణమాఫీ చేసామని, మరో రూ.2వేలు మహిళా దినోత్సవం రోజు వెయ్యబోతున్నామని చెప్పార‌న్నారు. 2014 ముందు కరంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుండి ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. 2014 ముందు ఎటూ చాల‌ని రూ.200 పెన్షన్ వచ్చేవార‌ని దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే సంతకంతో 5 రేట్లు పెంచి రూ.1000 ఇస్తున్నరని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 50 లక్షల మందికి రూ.వెయ్యి పెన్షన్ ఇస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 19 లక్షల ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వబోతున్న‌ట్లు పేర్కొన్నారు. ఏ రాష్ట్రం చెయ్యని విధంగా గడచిన మూడున్నర సంవత్సరాల్లో 14 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసామన్నారు. ఇలా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కేవలం టిడిపితో మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.

ఆధునిక వసతులతో కార్పొరేట్ ప్లే స్కూల్స్‌కు ధీటుగా 4200 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించారన్నారు. రూ.22వేల కోట్లు నిధులతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీరు అందించబోతున్నారని పేర్కొన్నారు. తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్‌తో తల్లి, బిడ్డలకు కావాల్సిన సహాయం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి చనిపోతే మహా ప్రస్తానం కార్యక్రమం ద్వారా పార్థివ దేహాన్ని తరలిస్తున్నామని చెప్పారు. చంద్రన్న భీమా ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1038 మంది కుటుంబాలకు చంద్రన్న భీమా పథకం ద్వారా సహాయం అందించామన్నారు.

67 ఏళ్ల వయస్సులో 24ఏళ్ల యువకుడిలా చంద్రబాబు కష్టపడుతున్నార‌ని చెప్పారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కష్ట పడుతున్నరని చెప్పారు. ఆ కష్టానికి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని మరింత వేగంగా అబివృద్ది చేయవచ్చని రాజా మాష్టారు అన్నారు. అనంతరం వివిధ‌ పోటీలలో విజేతలకు బహుమతులు ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి దృవీక‌ర‌ణ ప‌త్రాలు అందజేసారు. ఈ శిక్షణకు గుంటూరు జిల్లా తెనాలి, వినుకొండ, గురజాల, ప్రకాశం జిల్లా మార్కాపురం, నెల్లూరు జిల్లా సూళ్ళురుపేట, వేంకటగిరి, గూడూరు నియోజకవర్గ గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో కందుకూరు జడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్, శిక్షకులు పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు .