అమరావతి : టిడిపి వ్యూహ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం నిర్వహించిన వ్యూహకమిటి సమావేశం ముగిసింది. అలాగే, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 11న జ్యోతీరావు ఫూలే, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలు, 20న దళిత తేజం కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.
మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధికార పార్టీ ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. వివిధ సంఘాలతో జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు, నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు నిర్వహించాలని తీర్మానించారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు బస్సు యాత్ర చేపడతారని చంద్రబాబు ప్రకటించారు. అవినీతి, హత్యా రాజకీయాలకు పాల్పడినవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో కొందరు కుమ్మక్కై టిడిపిపై కుట్ర చేస్తున్నారని, నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను కోరారు.