Home ఆంధ్రప్రదేశ్ కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నామో అర్ధం చేసుకోవాలి : చంద్రబాబు

కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నామో అర్ధం చేసుకోవాలి : చంద్రబాబు

350
0

అమరావతి : బిజెపి ప్రభుత్వం గత  నాలుగు బడ్జెట్లలోనూ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ… భాజపాతో ఉండబోదని తెదేపా నిర్ణయించిందని, ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

‘రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్‌ కష్టాలను కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన భాజపా.. అధికారంలోకి రాగానే మరిచిపోయింది. సెంటిమెంట్‌తో నిధులు రావని జైట్లీ ఎలా చెబుతారు. తెలంగాణ రాష్ట్రాన్ని సెంటిమెంట్‌ ద్వారానే ఇచ్చిన సంగతి ఆయనకు తెలీదా? విభజన చట్టంలో ఉండే హామీలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోమని అడిగితే.. రక్షణ శాఖ బడ్జెట్‌ ప్రస్తావన ఎందుకు తెస్తారు. దేశ రక్షణను పణంగా పెట్టి మమ్మల్ని ఆదుకోమని మేం అడిగామా?మాకు దేశభక్తి లేదా? పార్లమెంటులో మా పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే.. కనీసం మాట్లాడదాం రండి అని ప్రధానమంత్రి పిలువలేక పోయారు? తెదేపా విలువలు కలిగిన పార్టీ కాబట్టే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. కేంద్రానికి మద్దతు ఇచ్చినా కేంద్ర మంత్రి పదవులు కోరుకోలేదు. వాళ్లు ఇస్తామంటేనే రెండు మంత్రి పదవులు తీసుకున్నాం. పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.’

‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని సూచించిందని గతంలో చెప్పారు. నిన్న రాజ్యసభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని చెప్పారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పరంగా అట్టడుగున ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదా?. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు ఇచ్చారు. అలాంటి పరిశ్రమలు మాకూ కావాలని అడుతున్నాం. ఎన్నికలకు ముందు మోదీ ఏపీ పట్ల ఎంతో సానుభూతి చూపించారు. దిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామన్నారు.. ఆ హామీలన్నీ ఏమైపోయాయి. అమరావతి నగరం దేశానికే తలమానికం అవుతుంది. అలాంటి నగరాన్ని నిర్మించేందుకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదు.’

‘రైల్వేజోన్ విషయంలో కేంద్రం దాటవేత ధోరణి అవలంభిస్తోంది. ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరలోనే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇతర రాష్ట్రాలకు రైల్వేజోన్‌ ఇచ్చినప్పుడు మమ్మల్ని అడిగారా? పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అది పూర్తయితే రాష్ట్రంలో కరువు ఉండదు. ఆ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించి రాష్ట్రాభివృద్ధకి ఆటంకం కలిగిస్తున్నారు. పోలవరంలో అవినీతి జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరంపై పవన్‌ కల్యాణ్‌ అవగాహన ఉండే మాట్లాడుతున్నారా?. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయాలపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు’ అని చంద్రబాబు అన్నారు.