Home ఆంధ్రప్రదేశ్ పేదల కళ్లలో ఆనందం చూస్తున్నా : చంద్రబాబు

పేదల కళ్లలో ఆనందం చూస్తున్నా : చంద్రబాబు

91
0

పర్చూరు : నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నానని సిఎం చంద్రబాబు అన్నారు. 28 రకాల పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. మన దేశంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెలా 63 లక్షల మందికి ఏడాదికి రూ.33,100 కోట్లు వ్యయం చేస్తున్నామని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే రాష్ట్రం దేశంలో ఒక్క ఏపీనే. రూ.200 పింఛను రూ.2 వేలు చేసింది నేనే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.3వేల పింఛను రూ.4 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ.10వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నామని అన్నారు. ప్రతి నెలా 1న ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే పింఛన్లూ అందిస్తున్నాను. ప్రతి నెలా ఒకటిన ఉదయం 9 గంటలకే 80 శాతం, తొలిరోజే 98 శాతం మందికి పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తున్న అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను.

పేదలకు ఆర్థిక భరోసా : కొందరి ఆదాయం కంటే పింఛను ద్వారానే ఎక్కువ వస్తోంది. ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లిన వారు పింఛను అందుకోలేకపోయేవారు. అలాంటి వారికి గత ప్రభుత్వంలో పింఛను ఇవ్వలేదు. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో మూడో నెలలోనైనా పింఛను తీసుకునే అవకాశం కల్పించాము. అలా రెండు నెలలు వరుసగా పింఛను తీసుకోని వారు మన రాష్ట్రంలో 93,324 మంది ఉన్నారు. వీరికి పింఛను ఆపేస్తే ప్రభుత్వానికి రూ.74 కోట్లు మిగుల్తుంది. కానీ పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ఆ సొమ్ము చెల్లిస్తున్నాము. అలాగే మూడు నెలలకూ పింఛను తీసుకోనివారు 16వేల మంది ఉన్నారు. వారికీ రూ.14 కోట్లు చెల్లిస్తున్నాం. భర్త చనిపోయిన భార్యకు వెంటనే పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. పింఛన్లు పంపిణీని టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నాం. పింఛను ఇంటికి తెస్తున్నారా లేదా, మర్యాదగా ఇస్తున్నారా లేదా అనే దానిపై నేను నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాను. తెలంగాణ- రూ.2,016, తమిళనాడు-రూ.1000, కేరళ-రూ.1600, కర్ణాటక-రూ.600, యూపీ, ఒడిశాలో రూ.500 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. సంక్షేమం ఇవ్వలేదనే వారికి ఇదే సమాధానం.