చీరాల : పాలిటెక్నిక్ డిప్లమోతో ఉద్యోగ సాధనలో ముందంజలో ఉండవచ్చని రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వరికూటి అమృతపాణి, తేళ్ల అశోక్‌కుమార్, విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ప్రొఫెసర్ బండారుపల్లి రాధ, న్యాయవాది బండారుపల్లి హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. అవ్వారువారి వీధిలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణా శిభిరాన్ని ఆదివారం ప్రారంభించారు. వీవర్స్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో అవ్వారు ముసలయ్య వరుసగా 12సంవత్సరాలుగా ఉచిత శిక్షణ నిర్వహించడం అభినందనీయమన్నారు.
సాంకేతిక చదువులకు మించినది మరొకటి లేదని ఫ్యాకల్టీ సభ్యులు పవని భానుచంద్రమూర్తి అన్నారు. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు ఎయిడెడ్ పాలిటెక్నిక్, ప్రవేటు ఇంజనీరింగ్ కళాశాలలో నడపబడుతున్న పాలిటెక్నిక్‌లలో నియామకాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 304కళాశాలలు, 26రకాల కోర్సులకు 85వేల సీట్ల భర్తీకి 10వ తరగతి సిలబస్ స్థాయిలో ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉచిత శిక్షణ, ఉచిత భోజన వసతి, ఉచిత స్టడీ మెటీరియల్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొత్తపేట మాజీ సర్పంచి చుండూరి వాసు, కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య, తమ్మా కోటేశ్వరరావు, శింగిరేసు శ్రీరామ్ పాల్గొన్నారు.