చీరాల : ఆంధ్రప్రదేశ్ అభివృద్దే బీజేపీ లక్ష్యమని బీజేపీ బాపట్ల పార్లమెంటు ఎస్‌సి మోర్చ నాయకులు మెడికొండ భరణీరావు అన్నారు. జండ్రాపేటలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టిడిపి, వైసిపి సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి శాన్యమని అన్నారు. చెప్పుకునేందుకు అవినీతి తప్ప ఏమీ లేదని ఆరోపించారు.
మీడియాను చెప్పచేతుల్లో ఉంచుకొని తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు, కేంద్ర ప్రభుత్వంపై అబద్ద ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన తప్పును ఇతరుల మీద నెట్టి ఎన్నికల్లో గెలిచే అలవాటు ఉన్న చంద్రబాబుకి ఈ సారి బీజేపీని లక్ష్యం చేసుకున్నాడని అన్నారు. అధికారికంగా కేంద్రం నుంచి అందుకున్న ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బీజేపీ, కేంద్రం, ప్రధాని ప్రత్యేకంగా చేస్తున్న సహాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు తాము ఈ కార్యక్రమం తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాది బండారు హేమంత్ కుమార్, శివాజీ పాల్గొన్నారు.