•కచ్చితంగా పొగాకు కొనుగోలు చేసి తీరుతాం
•నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం లేదు
•పొగాకు కంపెనీలు పద్ధతి మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్
•రైతు కష్టంలో ఉంటే.. పిచ్చి వేషాలు వేయొద్దు
•కంపెనీల మెడలో వంచైనా కొనుగోలు చేస్తాం
•రైతు ప్రయోజనాలు దెబ్బ తింటే చూస్తూ ఊరుకోము
•పొగాకు రైతుల ముఖాముఖిలో ఎమ్మెల్యే ఏలూరి
•రైతులకు అండగా ఉంటాం : ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
•పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం : వ్యవసాయ కమిషనర్ ఢిల్లీరావు
పర్చూరు : ‘రైతాంగం ధైర్యంగా ఉండండి. ఇది రైతు ప్రభుత్వం. రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం. రైతులు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోం.’ రైతులందరికీ అండగా ఉంటామని, ప్రతి రైతు వద్ద బర్లి పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రైతులకు భరోసా ఇచ్చారు. బర్లి పొగాకు కొనుగోలు లేక రైతాంగం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి సమస్య తీవ్రత వివరించారు. ఆ దశగా ప్రభుత్వం యంత్రాంగంలో కదిలికొచ్చింది. నేరుగా రైతుల వద్దకే ప్రభుత్వం వచ్చేలా కృషి చేశారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని ఉప్పుటూరు గ్రామంలో రైతులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రైతులతో మంగళవారం ముఖాముఖి నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో పొగాకు నిల్వలు, రైతాంగం పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకున్నారు. పొగాకు నిల్వలు చూసి రైతాంగానికి ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామంలో రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ కచ్చితంగా ప్రతి రైతు నుంచి పొగాకు కొనుగోలు చేసి తీరుతామని పేర్కొన్నారు. రైతులెవరు అధైర్య పడవద్దని, రైతులు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రభుత్వం నేరుగా రైతుల వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకునేందుకు కదిలి వచ్చిందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు నష్టానికి పంట అమ్ముకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సరైన ధర లభించే వరకు పంట కొనుగోలు చేసే వరకు విశ్రమించకుండా రైతాంగానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతులు బాగుంటేనే ప్రభుత్వం, కంపెనీలు బాగుంటాయని పేర్కొన్నారు. రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కంపెనీల దేనన్నారు. కంపెనీలు పద్ధతి మార్చుకొని రైతుల పంటను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయని పక్షంలో మెడలు వంచైనా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే ఉద్దేశాన్ని తాము ఖండిస్తున్నామని, అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రైతులెవ్వరు ఆందోళన చెందొద్దు : రాజశేఖర్
రైతులెవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఏలూరి రైతాంగం పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని రైతుల వద్దకు తీసుకు వచ్చాడని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీలు సైతం లాభాలు గడించినప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు రైతాంగానికి హితోదికంగా సాయపడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రైతులు కొంత సమయనం పాటించాలని, ఒక పద్ధతి ప్రకారం కొనుగోలు చేసేలా సమస్య పరిష్కరించేలా బాధ్యత తీసుకుంటామన్నారు.
రైతుల ప్రయోజనాలు ముఖ్యం : ఢిల్లీరావు
రైతు ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని పేర్కొన్నారు. రైతులకు మేలు జరిగే వరకూ కృషి చేస్తామని, యంత్రాంగం అనుక్షణం అండగా ఉంటుందని అన్నారు. రైతుల అభ్యర్థన మేరకు ఒక పద్ధతి ప్రకారం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. లేని పక్షంలో మార్క్ ఫైడ్ ద్వారా కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. సమస్య పరిష్కరించే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు.