Home ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్క‌ర్ రాజ్యాంగం కాదు.. చంద్రబాబు రాజ్యాంగం నడుస్తోంది : బాపట్ల ఎమ్మెల్యే కోన రఘపతి

రాష్ట్రంలో అంబేద్క‌ర్ రాజ్యాంగం కాదు.. చంద్రబాబు రాజ్యాంగం నడుస్తోంది : బాపట్ల ఎమ్మెల్యే కోన రఘపతి

428
0

ఒంగోలు : ప్ర‌స్తుతం రాష్ట్రంలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని, చంద్రబాబు రాజ్యాంగం నడుస్తోందని బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. గురువారం ఉదయం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23 మంది ప్రతి పక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనేసి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించిన చంద్రబాబు సర్కారుకు విపక్ష సభ్యులు జీతాలెలా తీసుకుంటారని అడిగే హక్కు లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ప్రజా క్షేత్రం నుండి ఎన్నికైన శాసన సభ్యులను కాదని టిడిపి ఇన్‌చార్జులకు అసెంబ్లీ నియోజకవర్గ నిధులు కేటాయిస్తూ జీవోలు జారీ చేయడం ఏ చ‌ట్టంలో ఉంద‌ని నిలదీశారు. చంద్రబాబు సర్కారులో బ్రాహ్మణులకు అడుగడుగునా అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటును స్వాగతించాం. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఐవీఆర్‌ కృష్ణారావు చైర్మన్‌ హోదాలో తన నియోజకవర్గంలో జరుగుతున్న సమావేశానికి విపక్ష స్థానిక శాసన సభ్యుడినైన‌ తనను ఆహ్వానిస్తే తట్టుకోలేక కృష్ణారావును బాధ్యతల నుండి తప్పించడం అవమానం కాదా అని ప్రశ్నించారు. కోటానుకోట్ల భక్తుల విశ్వాసానికి సంబంధించి రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై చర్చించకుండా ఆయనకు రాజకీయాలు ఆపాదించడమేమిటని ప్ర‌శ్నించారు. అగ్రవర్ణాల జాబితాలో ఉన్నా కూటికిలేని బ్రాహ్మణులు ఎందరో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ఇస్తున్నామని నమ్మబలికి ఇప్పటికి రూ.165 కోట్లకు మించి ఇవ్వలేదన్నారు. ఇది మోసం కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని త‌ప్పుప‌ట్టారు.

కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల జీతాల గురించి మాట్లాడే ముందు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఎందు కోసం ఖర్చుపెట్టారనే అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనేక మంది అర్చకులు పూట గడవని స్థితిలో పస్తులుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. బ్రాహ్మణులు, అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల సమగ్రాభివృద్ధి కోసం విశాఖలో ఈనెల 10న నిర్వహించే ఆత్మీయ సదస్సుకు బ్రాహ్మణ సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సదస్సుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో బ్రాహ్మణ సంఘం నేతలు ఆదిపూడి శాండిల్య, పాలూరి జ్వాలాపతి, మధుసూదన శర్మ, ఎస్‌. భీమశంకర శాస్త్రి, శ్రీరామచంద్రమూర్తి, కొల్లూరి రఘు కిరణ్‌ పాల్గొన్నారు.