బాపట్ల : ఇటీవల ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపధ్యంలో బ్యాంకు ఖాతాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఐ వినయ్‌కుమార్ అవగాహన కల్పించారు. పట్టణంలోని బ్యాంకుల్లో ఆయన గురువారం వెళ్లి అప్పటికి అందుబాటులో ఉన్న ఖాతాదారులతో మాట్లాడారు. ఎవరైనా బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓపిటి నెంబర్ కానీ, ఎటిఎం కార్డు వెనుక సిబిసి నెంబర్లుగాని అడిగితే చెప్పవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు ఎవ్వరూ అలాంటి నంబర్లు అడగరని గుర్తుంచుకోవాలన్నారు. ఖాతాదారుల వివరాల కోసం బ్యాంకు అధికారులు ఎవ్వరూ ఫోను చేయరన్నారు. అలా ఎవ్వరైనా ఫోన్లు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాలపై ఎలాంటి సమాచారం కావాలన్నా నేరుగా బ్యాంకులోనే సంప్రదించాలని సూచించారు.