– ప్రజాసంకల్ప యాత్రప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరికే నన్న జగన్
– తమ్మునికోసం పార్లమెంటు వదులుకున్న డాక్టర్ అమృతపాణి
– అప్పుడు కొండపి అభ్యర్ధిగా వరికూటి అశోక్‌బాబును ప్రకటించిన జగన్
– ఇప్పుడు ఉన్నత కులాలకు చేరువకాలేదని నిర్ణయం మార్చుకున్న జగన్
– బాలినేని, వైవి ఆదిపత్య పోరులో బాద్యతలకు దూరం చేసిన వరికూటి బ్రదర్స్‌కు ఏవిధంగా న్యాయం చేస్తారన్నదే చర్చనీయాంశం
– పార్టీ పిలుపులకు దూరంగా ఆందోళన, నిరసనలతో వరికూటి వర్గం
అధినేతను నమ్మి ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని నడిపిన వరికూటి బ్రదర్స్‌పట్ల పార్టీకి అనుకూల పరిస్థితులు వచ్చాక అధినేతే మాటమార్చడం ఆయన వర్గీయుల్లో ఆగ్రహాన్ని నింపింది. తాము వరికూటి అశోక్‌బాబు వెంటే ఉంటామని ప్రకటించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగానైనా నిలిపి గెలిపించుకుంటామన్న ధీమా వ్యక్తం చేయడం విశేషం.
ఒంగోలు : ఎంకిపెళ్లి సుబ్బికి తంటాలు తెచ్చిందన్న సామెత వినే ఉంటాం. వైసిపిలో వరికూటి బ్రదర్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి సామెతలే గుర్తొస్తున్నాయి. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో బాపట్ల పార్లమెంటు అభ్యర్ధిగా సీటు పొందిన డాక్టర్ వరికూటి అమృతపాణి ఎన్నికల్లో ఓటమి చెందారు. ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చు భరించారు. ఎన్నికల తర్వాత కూడా గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే వచ్చారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో కొండపి వైసిపినేతగా ఉన్న జూపూడి ప్రభాకర్ టిడిపిలోకి వెళ్లడంతో వైసిపికి నాయకత్వం కరువైంది.
ఆస్థితిలో రవాణ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న వరికూటి అమృతపాణి సోదరుడు వరికూటి అశోక్‌బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి కొండపి నియోజకవర్గ బాధ్యతల్లోకి వచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోకి పార్టీని విస్తరింపజేసి గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్ నిర్మాణం చేసుకున్నారు. మండల, గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రతి గ్రామంలో నేరుగా పేరు పెట్టి పిలవగలిగిన పరిచయాలు పొందారు. పార్టీకి నాయకత్వం వహించేందుకు ఎవ్వరూ లేని రోజుల్లో వెళ్లిన అశోక్‌బాబు నియోజకవర్గంలో పార్టీకి రూపం తీసుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో బాపట్ల పార్లమెంటు, కొండపి నియోజకవర్గంల రెండూ ఒకే కుటుంబంలో ఇవ్వడం సాధ్యం కాదని కందుకూరులో వరికూటి బ్రదర్స్‌తో చర్చించిన జగన్ ఏదో ఒకటి కోరుకోవాలని సూచించడంతో డాక్టర్ అమృతపాణి తన పార్లమెంటు బాధ్యతలు వదులుకుని కొండేపిలో తమ్ముడికి ప్రాతినిధ్యం ఇవ్వాలని సూచించారు. అప్పటి చర్చల అనంతరం కొండేపి వైసిపి అభ్యర్ధిగా వరికూటి అశోక్‌బాబును జగన్ ప్రకటించారు. ఇదంతా వైసిపి అభ్యర్ధుల భవితవ్యంపై నియోజకవర్గాల వారీగా సర్వే చేసుకోకముందు జరిగిన పరిణామం. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్ధుల పరిస్థితి అంశంపై పికె బృంధం సర్వే తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
బాలినేని, వైవి మద్య ఆదిపత్య పోరు
ఒంగోలు తాజా మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్య చాలా కాలం ఆదిపత్య పోరు నడిచింది. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలుతీసుకునే వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ వ్యవహారాల్లో పట్టీ పట్టనట్లు వ్యవహరించారు. వీరిద్దరి మద్య సమోధ్య కుదరకుంటే పార్టీ పరిస్థితి దిగజారుతుందనే చర్చ అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరికీ సమాన బాధ్యతలు ఇచ్చినప్పటికీ పార్టీలో ఎవరి ప్రతిపాదనలు వారివిగానే ఉన్నాయనే ప్రచారం ఉంది. బాలినేనితో సఖ్యతగా ఉంటే వైవి అభ్యంతరాలు వ్యక్తం చేయడం, వైవితో సఖ్యతగా ఉంటే బాలినేని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారనే విమర్శలు వైఎస్ఆర్‌సిపికి తలనొప్పిగా మారాయి. వీరిద్దరి పోరులో నియోజకవర్గ స్థాయిలో నేతలకు తిప్పలు తప్పడంలేదు.
కొండేపిలో ఏం జరిగింది?
పార్టీ ఇన్‌ఛార్జీగా ఉన్న వరికూటి అశోక్‌బాబు అందరినీ కలుపుకుని పోవడంలేదు. వంటరిగానే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలతో ఆయనకు సఖ్యత లేనందున రానున్న ఎన్నికల్లో ఓటమి చెందే అవకాశాలున్నాయనేది సర్వే సారాంశంగా చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు, గ్రామస్థాయి నాయకత్వం అశోక్‌బాబునే కోరుకుంటుంన్నప్పటికీ ఒక్క సర్వే రిపోర్టు పేరుతో అశోక్ బాబును పక్కన పెట్టడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నించారు. తమ అభ్యర్ధి అశోక్‌బాబేనని ప్రకటించుకున్నారు. అయినప్పటికీ పట్టించుకోని అధినేత మాట మార్చారు. అశోక్‌బాబుకు ప్రత్యామ్నయంగా ఒంగోలు రిమ్స్ వైద్యులు డాక్టర్ వెంకయ్యను ముందుకు తీసుకొచ్చారు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా వరికూటి వర్గం
అధినేత నిర్ణయంతో వరికూటి బ్రధర్స్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ నేత అశోక్‌బాబేనని ప్రకటించడమే కాకుండా అతని వెంటే పయనిస్తామని చెప్పారు. పార్టీ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధినేత ఇచ్చిన పిలుపు కొండేపిలో ఎవ్వరూ అందుకోలేదు. కొండేపిలో బంద్ కార్యక్రమాన్ని ఎవ్వరూ నిర్వహించలేదు. తమనేతకు న్యాయం చేసేవరకు నిరసన వ్యక్తం చేసేందుకే సిద్దమయ్యారు.
నష్టం నివారణ చర్యలపై అంతుబట్టని అధినేత వైఖరి
వరికూటి బ్రదర్స్‌ను విస్మరిస్తే జరిగే నష్టంపై కూడా సర్వే బృంధం నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొండేపితోపాటు సంతనూతలపాడు, చీరాల వంటినియోజకవర్గాల్లోనూ ప్రభావం పడనుంది. బాపట్ల పార్లమెంటు పరిధిలోని పర్చూరు, అద్దంకి, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోనూ అమృతపాణితో సన్నిహితంగా ఉండే వర్గం ఉంది. ముందు ఎవ్వరో ఒక్కరే తేల్చుకోమని చెప్పడం, ఆతర్వాత సర్వే పేరుతో తమ్ముడికీ అన్యాయం చేయడంపై అధినేత నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. మాట తప్పని నేత జగన్‌ను నమ్ముకుని ఖర్చులు పెట్టుకుని నాలుగేళ్లు పార్టీని నడిపితే ఇలాంటి అవమానం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వరికూటి బ్రదర్స్‌కు ఇద్దరికీ పోటీ చేసేందుకు స్థానం లేకుండా చేసినప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నయం చూపుతారు? అన్నీ పార్టీల్లోలాగానే వాడుకుని వదిలేస్తారా? ఇలాంటి సందేహాలకు అధినేత జగన్ తీసుకునే భవిష్యత్ నిర్ణయంపై సమాధానం ఆధారపడి ఉంది.