Home ఆంధ్రప్రదేశ్ బాబు స్వరంలో కరుకుదనం ఎలా పెంచారో చూడండి…?

బాబు స్వరంలో కరుకుదనం ఎలా పెంచారో చూడండి…?

395
0

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం మార్చారు. తన గొంతులో కరకుధనం పెంచారు. చీటికీ మాటికి అడ్డుపడుతున్న వారిని నేరుగా హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు తాను పాటుపడుతుంటే.. వైసీపీ దివాలా తీయించేందుకు అన్నింటా అడ్డుపడుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం 2019 ఎన్నికల్లో టిడిపిని మళ్లీ గెలిపించడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటును ప్రయోగించాలని కోరారు. తన ప్రభుత్వ పాలన 1500 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని దోనేపూడిలో ‘గ్రామదర్శిని-గ్రామవికాసం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 1930లో అమెరికా ఆర్థిక మాంధ్యంలో ఉన్న సమయంలో అక్కడి రాజ్యాంగాన్ని కూడా సవరించి ప్రజలు రూజ్‌వెల్ట్‌ను నాలుగు సార్లు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని గుర్తుచేశారు. సంక్షోభ పరిస్థితుల్లో ఆయనే దేశానికి అవసరమన్న నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

“ప్రస్తుతం రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. దీనిని చక్కదిద్దే సామర్థ్యం నాకు ఉందనే గత ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపించారు. రేపటి ఎన్నికల్లోనూ గెలిపించుకోవలసిన చరిత్రాత్మక అవసరం ఏర్పడింది. ఆ విజయం కూడా ఏకపక్షంగా ఉండాలి. మొత్తం 25 మంది ఎంపీలనూ గెలిపించుకుంటే కేంద్రంలో చక్రం తిప్పగలం. మన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుంది” అని అన్నారు. రాష్ట్రానికి సేవచేసే విషయంలో రాజీపడనని చెప్పారు. అభివృద్ధికి అడ్డొస్తే ఎంతటివారినైనా తొక్కుకుంటూ ముందుకు పోతానని హెచ్చరించారు.

‘ధర్మాన్ని మీరు కాపాడితే, అది మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరి వల్ల సంక్షేమం జరిగిందో మీరే అంచనా వేసుకోవాలి. అందరూ భాగస్వాములు కావాలి’ అని కోరారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపిస్తామని జనం నినాదాలు చేశారు. ‘జగన్‌కు దొంగలెక్కలు రాసుకునే అనుభవం తప్ప, రాజకీయ అనుభవం లేదు. అటువంటివారిని గెలిపిస్తే రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం కాదు.. ఏకంగా అమ్మేస్తారు.’ అని ఆరోపించారు.

“ఈపాటికే కేసుల భయంతో జగన్‌ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారాడు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ పొత్తు ధర్మాన్ని మరచి రాష్ట్రాన్ని మరింత కుంగదీసిన బీజేపీలో చేరి నాపైనే విమర్శలు చేస్తున్నారు. ఆయన వైసీపీకి సొంత మైకు. బీజేపీకి మాత్రం అద్దెమైకు. కొత్తగా వచ్చిన జనసేననూ బీజేపీ నాపైకి వదిలింది. రాష్ట్రానికి అన్యాయం చేసినవారిపై ఇప్పటికే మూడు ధర్మపోరాట దీక్షలు చేశాం. ఈ నెలలో ప్రకాశం జిల్లాలో నాలుగో దీక్ష చేపడుతున్నాం. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద పోలవరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కాలని ప్రయత్నం చేశారు. అవేమీ పారలేదు. గడ్కరీకే హెచ్చరికలు చేశాను. రాష్ట్రానికి రావలసిన హక్కును సాధించుకునేవరకు వదిలిపెట్టేది లేదు.. తెలుగువారి సత్తా చూపుతామని స్పష్టంచేశాను.’ అని చంద్రబాబు గుర్తు చేశారు.

మోడీ ప్రభుత్వం దేశాన్ని ముంచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల దేశానికి ఒరిగిందేమీలేదు. బ్యాంకులు దివాలా తీశాయి. జీఎస్టీ పేరుతో చిరు వ్యాపారులపై వేధింపులు పెరిగాయి. నిరుద్యోగం పెరిగింది. బిజెపి సంస్కరణలు ఇంత దారుణంగా ఉంటాయని ప్రజలు ఊహించి ఉండరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి వాటిపై ప్రజల మనోగతాన్ని తెలుసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న టీడీపీకి ప్రజానీకం ఐక్యంగా ఉండి సంఘీభావం ప్రకటించాలి’ అని చంద్రబాబు నాయుడు కోరారు.