చీరాల : నారుమడి – యాజమాన్య పద్దతులపై వ్యవసాయాధికారిణి ఇ ఫాతిమ దేవినూతల, కావూరివారిపాలెం గ్రామాల్లో రైతులకు మంగళవారం వివరించారు. ఆయా గ్రామాల్లో పొలం పిలుస్తుంది గ్రామసభలు నిర్వహించారు. నారుమడిలో విత్తిన 10రోజులకు సెంటు నారుమడికి 160గ్రాముల కార్బోప్యూరాన్, 3గ్రాముల గుళికలు వేసుకోవాలని సూచించారు. ఐదు సెంట్ల నారుమడికి 2కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, ఒక కిలో పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలని చెప్పారు.
చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భాస్వరం ఎరువు రెట్టింపు వేసుకోవాలని చెప్పారు. నారుమడిలో జింక్ లోపం గమనించినట్లయితే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్పేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై కూడా జింక్ సల్ఫేట్ అందజేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన రైతులు ఆధార్, పాస్‌బుక్ జెరాక్స్‌లతో తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిఇఒ మొబీనా, సాంబశివరావు పాల్గొన్నారు.