లఖ్‌నవూ : పెళ్లి పెటాకులు కావడానికి పెద్ద కారణాలేమీ అక్కరలేదు. అన్నీ సున్నితమై పోతున్న ప్రస్తుత రోజుల్లో వివాహ బంధాలు సున్నితంగానే ఉంటున్నాయి. పెద్దలు పెళ్లి కుదిర్చారు. పీటల దాకా వచ్చింది. వధువు తరపు బంధువులు, వరుని తరపు బంధువులు వివాహ పనులన్నీ పూర్తి చేశారు. కొద్దిసేపట్లో వివాహం జరగాల్సి ఉంది. వధువును వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వరుని కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో వరుని బంధువులు అక్కడి చేరుకున్నారు. ఇక వివాహ తంతు ప్రారంభం కావాల్సి ఉండగా ఉన్నట్లుండి వరుడు అడ్డం తిరిగాడు. వివాహం తనకొద్దన్నాడు. ఎందుకని ప్రశ్నిస్తే మీ అమ్మాయి 24గంటలూ వాట్స్ఆప్‌లో బిజీగా ఉంటుందట. అలాంటమ్మాయిని చేసుకుని అవస్థలు పడలేనని చెప్పేసి పెళ్లి రద్దు చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది.
వివాహం నిలిచిపోవడంతో ఇరు కుటుంబాల మధ్య వాదన చోటుచేసుకుంది. వధువు తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లికి రూ.64 లక్షలు కట్నం కోరడంతో అది ఇవ్వనందుకు తమ కుమార్తెపై నిందలు వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వధువుతరపు ఫిర్యాదుపై వరుడి కుటుంబీకులను పోలీసులు విచారిస్తున్నారు.
గత జూన్‌లో బిహార్‌లోని సరణ్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పెళ్లి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఆ సమయంలో ఉరుములు ఉరమడంతో వరుడు కొద్దిగా భయపడ్డాడు. ఉరుములకే భయపడ్డ వరుని ప్రవర్తన వింతగా ఉందంటూ వధువు పెళ్లి నిరాకరించి వెళ్లిపోవడంతో వివాహం నిలిచిపోయింది.