– వైద్య సౌకర్యాలు, పారిశుధ్య పనుల మెరుగుకు వినతి
– మరిన్ని క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన
– టీటీడీ ఈఓ తో చెవిరెడ్డి భేటీ
– సానుకూల స్పందన దిశగా టీటీడీ
తిరుపతి : కోవిడ్ -19 కరోనా పరిస్థితులలో
టీటీడీ సంపూర్ణ సహకారంతోనే కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో కరోనా నుంచి కోలుకున్న బాధితులు జీవితకాలం ఋణ పడివుంటారన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో టీటీడీ సహకారం ఎనలేనిదని చెవిరెడ్డి కొనియాడారు. శనివారం టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను కలిశారు. రానున్న రోజుల్లో కరోనా విజృంభించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ నేపధ్యంలో మరిన్ని క్వారంటైన్ కేంద్రాలు పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాల కల్పన, పారిశుధ్య పనులు చేపట్టడం వంటి పలు అంశాలపై చర్చించారు. ఇందుకు టీటీడీ ఈఓ సానుకూలంగా స్పందించారు. అనంతరం చెవిరెడ్డి మాట్లాడుతూ టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థ ఉండటం జిల్లా ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. టీటీడీ సంపూర్ణ సహకారం అందించడం ద్వారా కరోనా బాధితులకు సేవ చేయగలిగామని చెప్పుకొచ్చారు. టీటీడీ సహకారం లేకపోతే కరోనా బాధితులకు అందించే సేవలు ఊహించలేమన్నారు. శ్రీనివాసం, విష్ణునివాశం, మాధవం, టీటీడీ ఆయుర్వేద వైద్యశాల వంటివి కేటాయించడంతో పాటు భోజన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు టీటీడీ చూపిన చొరవను గుర్తుచేశారు. ఈ భేటీలో టీటీడీ జేఈఓ బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు