ప్రకాశం : వైఎస్సార్ చేయూతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. మాట తప్పను – మడమ తిప్పను అని చెప్పే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాట తప్పుతున్నారో, ఎందుకు మడమ తిప్పుతున్నారో ప్రజలకు అర్ధం కావడంలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలో ఆర్ధికంగా వెనకబడిన మహిళలకు వైయస్సార్ చేయూత పెన్షన్ పధకం క్రింద నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న జగన్, జులై నుండి ఇవ్వాల్సిన పెన్షన్ ప్రకారం సంవత్సరానికి ముప్పై వేలు ఇవ్వవలసి ఉండగా, ఇప్పుడు మాత్రం కేవలం రు.18,750 మహిళల ఖాతాలో జమచేస్తామని చెప్పడం, నిన్ను నమ్మి నీకు ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తూ, విశ్వసనీయతకు తూట్లు పొడవడం కాదా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా మీరిచ్చే రూ.18,750లతో జీవనోపాధి కార్యక్రమాలకు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను నడుపు కోవడానికి వాడుకోవచ్చని చెప్పడం హాస్యాస్పదం కాదా అన్నారు. పైపెచ్చు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ “నెలకు పెన్షన్ వెయ్యి రూపాయల చొప్పున 12 వేలే కదా వచ్చేది. నేను రూ.18,750లు ఇస్తున్నానని అన్నారు.” అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ.2,250ల గురించి మీరు మర్చిపోయినట్లు నటిస్తూ ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సబబో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలపాలన్నారు. జగన్ పేద ప్రజల్ని, ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనారిటీ మహిళల్ని మోసం చేయడమేనని అన్నారు.