Home ఆంధ్రప్రదేశ్ అడుగ‌డుగునా జ‌న నీరాజ‌నం – వ‌డివ‌డిగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌

అడుగ‌డుగునా జ‌న నీరాజ‌నం – వ‌డివ‌డిగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌

515
0

చీరాల : వైసిపి అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర శ‌నివారం చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతుంది. ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం సంత‌రావూరు వైపునుండి చీరాల నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించారు. వేట‌పాలెం స‌మీపంలోని పుల‌క కాలువ వ‌ద్ద‌నుండి జ‌గ‌న్ పాద‌యాత్ర శ‌నివారం ప్రారంభించారు. రావూరు గేటు మీదుగా వేట‌పాలెం మ‌సీదు సెంట‌ర్‌కు చేరుకున్నారు. అక్క‌డి నుండి వేట‌పాలెం రామ‌న‌గ‌ర్‌, మంకిన‌మాల‌ప‌ల్లె మీదుగా దేశాయిపేట చేరుకున్నారు. దేశాయిపేట నుండి జాండ్ర‌పేట‌కు చేరుకున్నారు. జాండ్ర‌పేట ఉన్న‌త పాఠ‌శాల మైదానంలో భోజ‌నం చేశారు. అక్క‌డి నుండి యాత్ర జాండ్ర‌పేట మ‌సీదు సెంట‌ర్‌కు చేరుకున్నారు. జాండ్రపేట అన్న‌పూర్ణ ట్ర‌స్టు స‌మీపంలో ఏర్పాటు చేసిన విశ్రాంతి విడిదిలో విశ్రాంతికి ఉప‌క్ర‌మించారు. యాత్ర సాగినంతదూరం పార్టీ కార్య‌క‌ర్త‌లు, జ‌నం పెద్ద ఎత్తున జ‌గ‌న్ వెంట అనుక‌రించారు. కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న‌న్న జిందాబాద్ అంటూ యువ‌త నినాదాలు చేస్తూ యాత్ర‌లో ఉత్సాహం వ్య‌క్తం చేశారు. అడుగ‌డుగునా జ‌గ‌న్ యాత్ర‌కు పూల‌వ‌ర్షం కురిపించారు. యువ‌కులు, అభిమానుల నినాదాలతో జ‌గ‌న్ యాత్ర ఉత్సాహంగా సాగింది. యాత్ర‌లో జ‌నం జ‌గ‌న్‌కు స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు అంద‌జేశారు. జ‌గ‌న్ వెంట వైసిపి జిల్లా అధ్య‌క్షులు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, బాప‌ట్ల పార్ల‌మెంటు ఇన్‌ఛార్జి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, చీరాల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి య‌డం బాలాజి, గ‌త ఎన్నిక‌ల్లో వైసిపి బాప‌ట్ల పార్ల‌మెంటు అభ్య‌ర్ధి డాక్ట‌ర్ వ‌రికూటి అమృత‌పాణి ఉన్నారు.

యుటిఎఫ్ విన‌తి : యుటిఎఫ్ ఆధ్వ‌ర్యంలో ఉపాధ్యాయులు జ‌గ‌న్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్ధకం చేస్తూ ప్ర‌భుత్వం నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టిన కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ విధానం (సిపిఎస్‌)ను ర‌ద్దు చేయించి పాత పెన్ష‌న్ విధానం (ఒపిఎస్‌)ను అమ‌లు చేసేందుకు కృషి చేయాల‌ని ఉపాధ్యాయులు జ‌గ‌న్‌ను కోరారు. జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో యుటిఎఫ్ రాష్ట్ర‌కౌన్సిల్ స‌భ్యులు కె వీరాంజ‌నేయులు, ప‌ట్ట‌ణ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు పాలేటి సురేష్‌, షేక్ జానీబాషా ఉన్నారు.

చీరాల మండ‌లం గ‌వినివారిపాలెంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న త‌మ ఇంటిపై ఎంఎల్ఎ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ వ‌ర్గీయులు దాడిచేసి త‌మ త‌ల్లి దేవ‌ర సుబ్బులును హ‌త్య‌చేశార‌ని దేవ‌ర సుబ్బులు కూతురు, కుటుంబ స‌భ్యులు వైఎస్ జ‌గ‌న్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. చీరాల గ‌డియార స్థంభం సెంట‌ర్‌లో త‌న భ‌ర్త జ‌ర్న‌లిస్టు నాగార్జునరెడ్డిపై ఎంఎల్ఎ అన్న దాడిచేశార‌ని, ఆ ఘ‌ట‌న‌లో నేటికీ త‌న భ‌ర్త‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని నాగార్జున‌రెడ్డి భార్య జ‌గ‌న్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.