Home ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమైన ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ శాసన సభలో తీర్మానం చేయాలి చీరాల సెమినార్‌లో ప్రజాశక్తి...

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమైన ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ శాసన సభలో తీర్మానం చేయాలి చీరాల సెమినార్‌లో ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంపాదకులు ఎస్‌ వెంకట్రావు

338
0

చీరాల : రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమైన ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని, కేంద్రప్రభుత్వ ఫాసిస్టు పోకడలకు వ్యతిరేకంగా ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రావాలని ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంపాదకులు ఎస్‌ వెంకట్రావు కోరారు. సిపిఎం, సిపిఐ, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చీరాల ముస్లిం షాదీఖానాలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం హిందువులను ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలపై రెచ్చగొట్టేందుకు ఎన్‌ఆర్‌సి అంశాన్ని ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. దేశంలో నోట్ల రద్దు తర్వాత కేంద్రప్రభుత్వ చర్యల కారణంగానే కృత్రిమ సంక్షోభం సృష్టించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా లక్షల కంపెనీలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా ఉపాధి అవకాశాలు లేక, విద్యా, వైద్యానికి దూరమైన పేదలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి ప్రజల మౌళిక సమస్యలు వదిలేసి దేశ ప్రజల పౌరసత్వమే ప్రధాన సమస్యగా తెరపైకి తెచ్చి ప్రజల మద్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం దుర్మార్గమైన చర్యలని పేర్కొన్నారు. దేశంలో అశాంతికి మూలమైన బిజెపి విధానాలను ఈపాటికే కేరళ, బెంగాల్‌ వంటి రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. శాసన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తున్నట్లు చేసిన ప్రకటనను శాసన సభలో తీర్మానం చేయాలని కోరారు. సభకు సిపిఎం కార్యదర్శి ఎన్‌ బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, ముస్లిం ఐక్యవేదిక నాయకులు సయ్యద్‌ అలీంబాబు అధ్యక్షత వహించారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు కె ఉమామహేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య, మక్కా మసీదు అధ్యక్షులు షేక్‌ ఇంతియాజ్‌ షరీఫ్‌, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ రహీమ్‌, ముస్లిం ఐక్యవేదిక నాయకులు మునీర్‌ఖాన్‌, దళిత ప్రజాచైతన్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ బెజ్జం విజయ్‌కుమార్‌, లాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ నాయకులు గూడూరు శివరామప్రసాద్‌ పాల్గొన్నారు.