అమరావతి : రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అమరావతిలో మాదక ద్రవ్యాలపై సమాచార సేకరణకు ప్రత్యేక సెల్ ను, సీఐడీ విభాగంలో వాట్సప్ నెంబర్ ను ఆయన ప్రారంభించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రజల నుంచి సమాచార సేకరణకు నార్కోటిక్ సెల్ గా 7382296118 వాట్సప్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. సెల్ ఇన్ ఛార్జిగా ఎస్పీ కేజీవీ సరితకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం, వినియోగంపై సమాచార సేకరణ కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు భాగస్వాములై కచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. పక్కా సమాచారం అందిస్తే పారితోషికం ఇస్తామన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.